బాగా చదివి కుటుంబాన్ని పోషించాలంటూ ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు సంచలనంగా మారుతున్నాయి. కొద్దిరోజుల క్రితం మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. ఈ రోజు మరో విద్యార్థి సూసైడ్ కు పాల్పడ్డాడు. బాసర RGUKT విద్యార్థి.. హాస్టల్ గదిలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. PUC మొదటి సంవత్సరం చదువుతున్న స్టూడెంట్ జాదవ్ బబ్లూ.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన జాదవ్ బబ్లూ.. హాస్టల్ గదిలో ఉరేసుకుని కనిపించడం కలకలానికి దారితీసింది. వెంటనే అంబులెన్స్ లో విద్యార్థిని అక్కణ్నుంచి నిర్మల్ హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు బాసర RGUKT అధికారులు తెలియజేశారు.
ఏడాది కాలంలో నలుగురు మృత్యువాత
కొద్ది రోజుల క్రితం సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన లిఖిత(17) నాలుగో ఫ్లోర్ నుంచి కిందపడింది. హాస్పిటల్ తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయింది. అది ప్రమాదమా, ఆత్మహత్యనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. బజ్జీల బండి నడుపుతూ కూతుర్ని ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో ట్రిపుల్ ఐటీలో చేర్పిస్తే అఘాయిత్యం జరిగిపోయిందని ఆమె తల్లిదండ్రులు రోదించారు. లిఖిత మృతికి రెండు రోజుల ముందే దీపిక అనే అమ్మాయి ప్రాణాలు తీసుకుంది. సంగారెడ్డి జిల్లా కోటపల్లి మండలం గోరేకల్ కు చెందిన దీపిక.. బాత్రూంలో చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న విద్యార్థినిని గుర్తించి భైంసా హాస్పిటల్ తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. ఫస్టియర్ స్టూడెంట్ దీపిక ఆత్మహత్యకు పాల్పడిన రెండ్రోజుల తర్వాత లిఖిత అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయింది.
బంగారుమయమా… భారమా…
బాసర ట్రిపుల్ ఐటీలో చదివే వారిలో 99 శాతానికి పైగా పేద కుటుంబాలకు చెందిన పిల్లలే ఉంటారు. టెన్త్ లో మండల స్థాయిలో టాపర్లుగా నిలిచే విద్యార్థులకే ఇంజినీరింగ్ సీటు దొరుకుతుంది. తల్లిదండ్రుల కష్టాలను తొలగించాలంటే తాము బాగా చదివి భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలన్న లక్ష్యంతోనే అందులో చేరుతుంటారు. కొన్ని నెలల క్రితం భోజనం సరిగా లేక విద్యార్థులు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ఒకపూట తిండి, మరోపూట ఎండి అయినా బాధ బయటకు తెలియకుండా చదువులు కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా చోటుచేసుకుంటున్న దుర్ఘటనలు ట్రిపుల్ ఐటీ చదువుని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
Chala badhakaram…