గెలిస్తే నిలిచినట్లు.. లేదంటే 3-0తో సిరీస్ కోల్పోయినట్లే. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టు పోరాట పటిమను కనబరిచింది. మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోయినా సూర్యకుమార్(83; 44 బంతుల్లో, 10×4, 4×6), తిలక్ వర్మ(49 నాటౌట్; 37 బంతుల్లో, 4×4, 1×6) వీరవిహారంతో పరువు నిలబెట్టుకుంది. వెస్టిండీస్ ను 159/5కు కట్టడి చేసిన టీమ్ ఇండియా 17.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రెండన్ కింగ్(42), కైల్ మయర్స్(25) శుభారంభం అందించారు. జాన్సన్ ఛార్లెస్(12) మూడో వికెట్ గా వెనుదిరిగాడు. తొలి రెండు వన్డేల్లో రాణించిన నికోలస్ పూరన్(20) కాసేపటికే ఔటయ్యాడు. కానీ కెప్టెన్ రోమన్ పావెల్(40 నాటౌట్; 19 బంతుల్లో, 1×4, 3×6) ధనాధన్ ఆటతీరుతో జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. షిమ్రన్ హెట్ మయర్ సైతం(9) రన్స్ కే ఔటవడంతో కరీబియన్ జట్టు 159 పరుగులు చేయగలిగింది. కుల్దీప్ యాదవ్(3/28) వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.
అనంతరం 160 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు మళ్లీ పాత కథే ఎదురైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(1), గిల్(6) వెంటవెంటనే వెనుదిరిగారు. ఈ మ్యాచ్ తో టీ20 అరంగేట్రం చేసిన యశస్వి.. ఒక్క పరుగుకే ఔటయ్యాడు. 34 పరుగులకే 2 వికెట్లు పడ్డ జట్టును సూర్య, తిలక్ వర్మ ఆదుకున్నారు. తన పాత ఆటతీరుతో సూర్య.. గ్రౌండ్ నలువైపులా షాట్లతో అలరించాడు. వీరిద్దరి దూకుడైన ఆటతీరుతో భారత్ 5.3 ఓవర్లలో 50… 10.3 ఓవర్లలో 100 పరుగులకు చేరుకుంది. చివరకు సూర్య ఔటయినా తిలక్, హార్దిక్ కలిసి భారత్ ను గెలిపించారు. విండీస్ బౌలర్లలో జోసెఫ్ 2, మెకాయ్ 1 వికెట్ తీసుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. 5 మ్యాచ్ ల సిరీస్ లో విండీస్ 2-1తో నిలిచింది.