
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA అధికారులు మరోసారి రాష్ట్రంలో సోదాలు జరుపుతున్నారు. ఇప్పటికే ఒక ఉగ్ర కుట్ర కేసులో భారీ అరెస్టులు జరగ్గా… ఇప్పుడు కరీంనగర్ లోనూ విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. PFIతో సంబంధాలున్నాయన్న కోణంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో పెద్దయెత్తున తనిఖీలు నిర్వహించారు. నాకా చౌరస్తా, కార్ఖానా గడ్డ ప్రాంతాల్లో అధికారుల టీమ్(Team)లు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. నిషేధిత స్టూడెంట్ యూనియన్ లీడర్ల కోసం ఈ గాలింపు జరుగుతున్నది. కరీంనగర్ కు చెందిన తబ్రేజ్ అనే వ్యక్తికి నిషేధిత సంస్థతో సంబంధాలున్నట్లు అనుమానిస్తూ NIA సోదాలు చేపట్టింది. తెల్లవారుజామున 3:30 గంటలకు తబ్రేజ్ ఇంటికి వచ్చిన NIA టీమ్.. దాదాపు 5 గంటల పాటు విస్తృతంగా సోదాలు నిర్వహించింది. తబ్రేజ్ దుబాయిలో ఉండగా.. అధికారులు మాత్రం ఆయన ఇంట్లో పెద్దయెత్తున సోదాలు చేపట్టారు.
హైదరాబాద్, భోపాల్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాలో ఇప్పటికే N.I.A.. 17 మందిని అరెస్టు చేసింది. హిజ్బ్-ఉత్-తహ్రీర్(HuT)కి అనుబంధంగా పనిచేస్తున్న ముఠాకు సంబంధించి హైదరాబాద్ లో భారీస్థాయిలో N.I.A. అధికారులు సోదాలు నిర్వహించారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 2023 మే 24న నమోదైన కేసులో ఇప్పటిదాకా 17 మందిని అరెస్టు చేసినట్లు N.I.A. అఫీషియల్(Official)గా ప్రకటించింది. ఇప్పుడు కరీంనగర్ లోనూ సోదాలు జరగడంతో కలకలానికి కారణమైంది.