
గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ఇప్పటికే ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన అభ్యర్థులు(Candidates).. ఏ మాత్రం తగ్గడం లేదు. పరీక్షను వాయిదా వేసే వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ.. TSPSC ఆఫీసు ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ నాంపల్లిలోని TSPSC ఆఫీసుకు భారీగా తరలివచ్చిన క్యాండిడేట్స్… ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకే నెలలో వరుసగా ఎగ్జామ్స్ ఉంటే ఎలా రాసేది అంటూ ధర్నా చేస్తున్నారు. అయితే ఆందోళన దృష్ట్యా పోలీసులు అప్పటికే భారీగా మోహరించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సెంటర్లు ఏర్పాటు చేసి గురుకుల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 1న స్టార్ట్ అయిన ఈ ఎగ్జామ్స్.. 23 వరకు కంటిన్యూగా ఉంటున్నాయి. ఇదే సమయంలో గ్రూప్-2 పరీక్షకు ప్రిపేర్ కావాల్సి ఉంది. TSPSC కార్యాలయానికి రాకుండా సమీపంలోని గ్రౌండ్ లోనే అందర్నీ అడ్డుకున్నారు.
ఎంతోకాలంగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలా ఒకేసారి అన్నింటినీ ప్రకటించడంతో అభ్యర్థుల్లో అయోమయం, ఆందోళన మొదలైంది. విపరీతంగా కాంపిటీషన్ ఉన్న పరిస్థితుల్లో బాగా చదవాలంటే పూర్తి సమయం కేటాయించాలని, కానీ గురుకుల పరీక్షల వల్ల ఆ టైమ్ దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు. దీనిపై మంత్రి KTR జోక్యం చేసుకుని గ్రూప్-2 ఎగ్జామ్స్ ని వాయిదా వేయాలంటూ TSPSC ముట్టడికి తరలివచ్చారు.
కోదండరామ్ మద్దతు… వివిధ పార్టీల సంఘీభావం
అభ్యర్థుల ఆందోళనకు కోదండరామ్ మద్దతునిచ్చారు. TSPSC ఆఫీసుకు వచ్చిన ఆయన.. క్యాండిడేట్స్ తో కలిసి అక్కడే బైఠాయించారు. పరీక్షల మధ్య వ్యవధి లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, ఇటు గ్రూప్-2, అటు JL, మరోవైపు గురుకుల ఎగ్జామ్స్.. ఇలా ఎన్ని పరీక్షలు ఒకేసారి రాయగలరు అంటూ కోదండరామ్ మండిపడ్డారు.