ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ విషయంలో మహబూబ్ నగర్ పోలీసులకు కోర్టు షాక్ ఇచ్చింది. మంత్రిపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించింది. సాయంత్రం 4 గంటల లోపు కేసు నమోదు చేశారో లేదో చెప్పాలని, ఫైల్ చేస్తే ఆ FIR వివరాల్ని అందజేయాలని స్పష్టం చేసింది. హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సంబంధించి కేసు విచారణ నడుస్తున్నది. ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ పై శ్రీనివాస్ గౌడ్ తోపాటు అధికారులపై కేసు ఫైల్ చేయాలని ఇంతకుముందే కోర్టు ఆదేశించింది. ఈ రోజు 4 గంటల్లోపు కేసు నమోదు చేశారో లేదో చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ PPని ఆదేశించింది.
ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ కు గాను 10 మందిపై FIR చేయాలని చెప్పినా మహబూబ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ పిటిషనర్ రాఘవేందర్ రాజు.. న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. వెంటనే కేసు ఫైల్ చేయాలని హెచ్చరించారు. నమోదు చేయని పక్షంలో కోర్టు ఉల్లంఘనగా పరిగణిస్తామంటూ స్పష్టం చేసింది.