క్వశ్చన్ పేపర్ లీకేజ్ కేసులో బుధవారం(ఆగస్టు 16న) అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసుపై రెండు కోర్టులు కీలక నిర్ణయాలు తీసుకోగా, మరికొన్ని అరెస్టులు జరిగాయి. కాంగ్రెస్ లీడర్ బక్కా జడ్సన్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL)ను విచారణకు స్వీకరిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం(High Court) డిసిషన్ తీసుకుంది. రిజిస్ట్రీ అభ్యంతరాలను పక్కన పెడుతూ మరీ పిటిషన్ ను స్వీకరించింది. మరోవైపు ఇదే కేసులో నాంపల్లి కోర్టు సైతం A2 నిందితుడికి బెయిల్ నిరాకరించింది. A2 రాజశేఖర్ రెడ్డి వేసుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు రిజెక్ట్ చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ పెట్టుకున్న నిందితుడి వినతిని తోసిపుచ్చుతూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాజశేఖర్ రెడ్డి మూడు సార్లు పిటిషన్ అప్లయ్ చేసుకోగా.. ఆ మూడుసార్లూ కోర్టు రిజెక్ట్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
మరోవైపు ఈ కేసులో సిట్ మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ప్రధాన నిందితుడు(Main Accused) అయిన ప్రవీణ్ కు చెందిన బంధువులు ముగ్గురిని సిట్(Special Investigation Team) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు ప్రవీణ్ కు సహాయ సహకారాలు అందించారని గుర్తించి అరెస్టు చేసింది. దీంతో ఈ క్వశ్చన్ పేపర్స్ లీకేజీ వ్యవహారంలో మొత్తం అరెస్టుల సంఖ్య 99కి చేరుకుంది. ఇలా క్వశ్చన్ పేపర్ లీకేజ్ కేసులో ఒకేరోజు మూడు కీలక పరిణామాలు చోటుచేసుకోవడం ఆశ్చర్యకరంగా మారింది.