రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హైదరాబాద్ మీర్ పేట బాలిక అత్యాచార ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారని రాచకొండ పోలీస్ కమిషనర్ DS చౌహాన్ తెలిపారు. గంజాయి మత్తులో దుండగులు 16 ఏళ్ల బాలికపై అరాచకానికి పాల్పడ్డారు. ఎనిమిది మంది సోమవారం నాడు ఆమె ఇంట్లోకి చొరబడి కత్తితో బెదిరించి అఘాయిత్యానికి పాల్పడగా.. ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి సోదరి కంప్లయింట్ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాన నిందితుడు మంగళ్ హాట్ ఏరియాకు చెందిన రౌడీషీటర్ అని CP తెలియజేశారు. మిగతావారిని కూడా త్వరగానే పట్టుకుంటామన్నారు. మరోవైపు జరిగిన దారుణంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు. రెండు రోజుల్లోపు రిపోర్ట్ ఇవ్వాలని CS, DGP, రాచకొండ CPకి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన తీవ్రమైన ఆవేదన కలిగించిందని, రెడ్ క్రాస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధులు తక్షణమే బాధితురాలి ఇంటికి వెళ్లి అవసరమైన సహాయం అందించాలని గవర్నర్ సూచించారు.