రాష్ట్రంలో మరో MLAపై అనర్హత వేటు పండింది. గత ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న కారణంతో గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. ఆయన స్థానంలో DK అరుణను MLAగా ప్రకటించింది. రెండో స్థానంలో నిలిచిన అరుణను కొత్త ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గద్వాల నియోజకవర్గ BRS అభ్యర్థిగా కృష్ణమోహన్ రెడ్డి 2018 ఎలక్షన్లలో పోటీ చేశారు. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ 2019లో ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. కృష్ణమోహన్ రెడ్డి తన ఆస్తులను పూర్తిగా వెల్లడించలేదని, కొన్నింటిని అఫిడవిట్ లో దాచిపెట్టారన్నది డీకే అరుణ ఆరోపణ. కేసును విచారణకు స్వీకరించి వాదోపవాదాలు విన్న కోర్టు.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అది నేరంగా పేర్కొంది. దీంతో కృష్ణమోహన్ రెడ్డిపై వేటు వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందుకు గాను కృష్ణమోహన్ రెడ్డికి రూ.2.50 లక్షలను జరిమానాగా కోర్టు విధించింది. పిటిషనర్ DK అరుణకు ఖర్చుల కింద మరో రూ.50 వేలు చెల్లించాలని తీర్పులో పేర్కొంది. మొత్తంగా కృష్ణమోహన్ రెడ్డి రూ.3 లక్షలు చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే కొత్తగూడెం BRS MLA వనమా వెంకటేశ్వర్ రావుపై అనర్హత వేటు పడింది. ఆయన స్థానంలో జలగం వెంకట్రావును MLAగా హైకోర్టు ప్రకటించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వనమా.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆర్డర్స్ పై సుప్రీం స్టే ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నారు.