ఎంట్రన్స్ పరీక్షలు రాసి, ర్యాంకులు సాధించి.. కాలేజీలు, యూనివర్సిటీల్లో చేరాల్సిన పని లేదు. మార్కుల కోసం పోటీపడి మరీ చదవాల్సిన అవసరమూ లేదు.. మాదగ్గరకొస్తే ఎలాంటి సర్టిఫికెట్ కావాలంటే అలాంటి సర్టిఫికెట్ ఇస్తామంటూ ఓ గ్యాంగ్ మోసాలకు పాల్పడుతోంది. ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేసి వాటిని అమ్ముతూ అక్రమ సంపాదనకు అలవాటు పడింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కేంద్రంగా ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. ముఠాలోని ముగ్గురు వ్యక్తుల్ని మీర్ చౌక్ PS, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో పట్టుకున్నారు. వివిధ యూనివర్సిటీలకు చెందిన 467 సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకుని వారికి రిమాండ్ కు తరలించారు.
నిందితుల నుంచి 40 సెల్ ఫోన్లు, 8 సిమ్ కార్డులు, 2 ల్యాప్ టాప్ లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇల్లీగల్ దందాతో కొనుగోలు చేసిన ఓ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ ను రికవరీ చేసుకున్నారు. ఈ స్థలం విలువ రూ.42 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.