
అభం శుభం తెలియని చిన్నోడు ఇంటి ముందు ఆడుకోవడానికి బయటకు వచ్చి మ్యాన్ హోల్ లో పడ్డ ఘటనలో.. కారకుల్ని గుర్తించారు. అందరినీ ఆవేదనకు గురిచేసిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. బాచుపల్లి సమీప ప్రగతి నగర్ NRI కాలనీలో జరిగిన ఘోరంలో… నాలుగేళ్ల మిథున్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై అన్ని వర్గాల నుంచి ఆవేదన, విమర్శలు వెల్లువెత్తాయి. GHMC నిర్లక్ష్యమేనంటూ ఆరోపణలు రావడంతో అధికారులు సీరియస్ గా తీసుకుని పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. బాగా వర్షం పడుతున్న సమయంలో నాలాను ఓపెన్ చేసిందెవరు.. దాని పై కప్పును ఎందుకు తెరవాల్సి వచ్చింది.. ఎవరి ఆదేశాలతో దాన్ని తొలగించారు.. అన్న కోణంలో అందరి నుంచి వివరాలు రాబట్టారు. అయితే ఆ మ్యాన్ హోల్ మూతను అక్కడ పనిచేస్తున్న అపార్ట్ మెంట్ వాచ్ మనే తీసినట్టు గుర్తించారు.
ఆ వాచ్ మన్ ను పిలిపించి ఎంక్వయిరీ చేస్తే పొద్దున ఎనిమిదింటికి మ్యాన్ హోల్ ఓపెన్ చేసింది తానేనని ఒప్పుకున్నాడు. అయితే అలా చేయాలని చెప్పింది మాత్రం కాలనీ అసోసియేషన్ నాయకుడని చెప్పడంతో కేసు అటువైపు తిరిగింది. పొద్దున 8 గంటలకు మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఉంచగా.. భారీ వర్షం పడ్డ టైమ్ లో 11 గంటలకు చిన్నోడు అందులో పడిపోయాడు. దీంతో పోలీసులు.. మ్యాన్ హోల్ తెరిపించిన, తెరిచిన వ్యక్తులిద్దరిపైనా కేసులు ఫైల్ చేశారు. సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఓ నిండు ప్రాణమైతే గాలిలో కలిసిపోయింది. పాపం ఎవరిదైనా.. ప్రాణం మాత్రం తిరిగిరాదుగా.