జీతం అడగడానికి కమాండెంట్ వద్దకు వెళ్లి అవమానభారంతో బయటకు వచ్చి పెట్రోలు పోసుకున్న హోంగార్డు రవీందర్… హాస్పిటల్ లో ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజులుగా వైద్యం అందిస్తున్నా ఆయన శరీరం సహకరించలేదు. ఈ రోజు అపోలో DRDO హాస్పిటల్ లో రవీందర్ మృతి చెందినట్లు అక్కడి డాక్టర్లు ప్రకటించారు. తొలుత ఆయన్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా మెరుగైన ట్రీట్మెంట్ కోసం అపోలో DRDOలో చేర్చారు. 67 శాతానికి పైగా కాలిన గాయాలతోపాటు ఊపిరితిత్తులు చెడిపోవడంతో పరిస్థితి సీరియస్ గా మారింది. అప్పట్నుంచి ఆయన ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్లు ట్రై చేసినా ఫలితం కనిపించలేదు. ఈ రోజు ఉదయం 6 గంటలకు రవీందర్ ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
చిలకలగూడలో పనిచేస్తున్న రవీందర్ ను రెండు నెలల క్రితమే చాంద్రాయణగుట్టకు ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే తనకు రావాల్సిన జీతానికి సంబంధించి ఈ నెల 5న హోంగార్డ్ కమాండెంట్ ను కలిసి బయటకు రాగానే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. హోంగార్డు అసోసియేషన్ లో కీలకంగా వ్యవహరించి అందరి సమస్యలు పరిష్కరించే రవీందర్ ఇలా చేసుకోవడం పట్ల ఆ సంఘంలో ఆవేదన ఏర్పడింది. తనను అవమానించేలా మాట్లాడారని సన్నిహితులు, కుటుంబ సభ్యుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పుకుంటున్నారు. దీనిపై హోంగార్డు అసోసియేషన్ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.