స్కిల్ డెవలప్ మెంట్ స్కాంకు సంబంధించి రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు.. హైకోర్టులోనూ చుక్కెదురైంది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. CID లాయర్లు చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. అటు చంద్రబాబును కస్టడీకి అప్పగించాలా, వద్దా అనే దానిపై కాసేపట్లో ACB కోర్టు నిర్ణయం వెలువరించనుంది. చంద్రబాబు తరఫు లాయర్లు హైకోర్టు ఎదుట తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి… క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తనపైన నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ ఆయన వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. 17A వర్తించదని బాబు లాయర్లు వాదిస్తే… అది ఎందుకు వర్తించదు అంటూ CID లాయర్లు గట్టిగా వాదనలు వినిపించారు. CID తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
సుప్రీంకోర్టుకు వెళ్తామన్న బాబు లాయర్లు
క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని బాబు తరఫు లాయర్లు చెబుతున్నారు. అక్కడ కూడా ఆయన తరఫు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించిన ఆర్డర్ కాపీ రాగానే డిసిషన్ తీసుకుంటామన్నారు.
నాలుగు కేసుల్లో…
చంద్రబాబుపై మొత్తం నాలుగు కేసులు ఫైల్ అయ్యాయి. అందులో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ప్రధానమైనది. ఈ కేసులోనే ఆయన ప్రస్తుతం రిమాండ్ అనుభవిస్తున్నారు. దీంతోపాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అవతకవతకలు జరిగాయంటూ ఆయనపై కేసు ఫైల్ అయింది. కావాల్సిన వాళ్లకు లబ్ధి చేకూర్చేలా అలైన్ మెంట్ డిజైన్ చేశారంటూ దాఖలైన కేసులో ఆయనను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలంటూ CID కోరింది. ఇక ఫైబర్ గ్రిడ్ స్కాంతోపాటు పుంగనూరు సమీపంలోని అంగళ్లులో జరిగిన అల్లర్లలోనూ చంద్రబాబు పాత్ర ఉందంటూ కేసులు నమోదయ్యాయి.