ఎన్నికల కోడ్(Model Code Of Conduct) అమల్లోకి రావడంతో పోలీసులు పెద్దయెత్తున సోదాలు, తనిఖీలు చేస్తున్నారు. కోడ్ వచ్చిన తొలి రోజే భారీగా నగదు, బంగారం, మద్యం స్వాధీనం(Recovery) చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని తెలుసో లేదో గానీ చాలా మంది డబ్బు తీసుకెళ్తూ పట్టుబడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో సాయంత్రం నుంచి పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోడ్లపై బైక్ లు, కార్లను ఆపి పరిశీలిస్తున్నారు. చాలా చోట్ల నగదు పట్టుబడగా ఒక చోట భారీగా బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చీరాగానే తాయిలాల పంపకాలకు రెడీ అయ్యారు లీడర్లు. అలా ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన వస్తువుల్ని గుర్తించి పలువురిని అరెస్టు చేశారు. GHMCతోపాటు వివిధ జిల్లాల్లోనూ పోలీసుల సోదాలు మొదలయ్యాయి.
12.65 కేజీల బంగారం, 3 క్వింటాళ్ల వెండి
హైదరాబాద్ లో రెండు వేర్వేరు చోట్ల వాహనాలు చెక్ చేస్తున్న సమయంలో మొత్తం 12.65 కేజీల బంగారం పట్టుబడింది. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిజాం కాలేజ్ గేట్ నంబర్ 1 దగ్గర 7 కిలోల పసిడి, 300 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. అటు చందానగర్ పరిధిలో 5.65 కిలోల బంగారం పట్టుబడింది. తారానగర్ లో బంగారంతోపాడు రెండు బైక్ లు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఓటర్లకు పంచేందుకు రెడీగా ఉంచిన 87 కుక్కర్లను గచ్చిబౌలి గోపన్ పల్లిలో సీజ్ చేసి ఇద్దర్ని అరెస్టు చేశారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ లీడర్ పేరుతో కూడిన స్టిక్కర్లు ఈ కుక్కర్లపై గుర్తించారు. వనస్థలిపురం వద్ద జరిపిన తనిఖీల్లో రూ.4 లక్షలు దొరికాయి. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం రాయికల్ టోల్ ప్లాజా వద్ద రూ.11.50 లక్షల్ని షాద్ నగర్ కు చెందిన వ్యక్తి బైక్ పై వెళ్తుండగా పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లిలో రూ.5.40 లక్షలు స్వాధీనం చేసుకోగా.. ఆధారాలు లేకపోవడంతో వాటిని ఆదాయపన్ను శాఖకు అప్పగించారు.