ఎన్నికల కోడ్(Model Code Of Conduct) అమలులోకి వచ్చిన నిన్నట్నుంచి హైదరాబాద్ జంటనగరాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. బంజారాహిల్స్ లో చేపట్టిన వెహికిల్స్ చెకింగ్ లో రూ.3.35 కోట్ల హవాలా మనీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ తోపాటు బంజారాహిల్స్ పోలీసులు జాయింట్ గా చెకింగ్ చేస్తున్న టైమ్ లో హవాలా మనీని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. చింపిరెడ్డి హన్మంతరెడ్డి, బచ్చల ప్రభాకర్, మండల శ్రీరాములు రెడ్డి, ఉదయ్ కుమార్ అనే వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ జోన్(West Zone) DCP జోయల్ డేవిస్ తెలిపారు. ప్రధాన సూత్రధారిగా చింపిరెడ్డిని గుర్తించిన పోలీసులు.. హన్మంతరెడ్డి ప్లానింగ్ ప్రకారమే మిగతా ముగ్గురు హవాలా మనీ సేకరిస్తుంటారన్నారు. రోడ్ నంబరు-3 రోడ్డు వద్ద చెకింగ్ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన కియా కారులో సోదాలు చేశారు. దీంతో భారీ స్థాయిలో అక్రమ నగదు బయట పడింది.
ఆఫీసు ఏర్పాటు చేసి మరీ…
ఈ గ్యాంగ్ వివిధ ఏరియాల్లో హవాలా డబ్బును సేకరించి తరలిస్తూ ఉంటుందని DCP తెలియజేశారు. అరోరా కాలనీలో గల సాయికృప బిల్డింగ్ లోని ప్లాట్ నంబరు 583లో ఆఫీసును కూడా ఏర్పాటు చేసుకున్నారన్నారు. కోటి రూపాయలు తరలిస్తే రూ.25,000 కమీషన్ గా అందుతుంది. బేగం బజార్, నాంపల్లి, గోషా మహల్, జూబ్లీహిల్స్ నుంచి కలెక్ట్ చేసిన డబ్బును వారి ఆఫీసుకు షిఫ్ట్ చేస్తున్న టైమ్ లో పోలీసులు పట్టుకున్నారు.