ప్రజాప్రతినిధుల(Public Representatives) కేసులపై సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) కీలక ఆదేశాలిచ్చింది. స్పష్టమైన కారణాలు ఉంటే తప్ప MP, MLA, MLCల కేసులు వాయిదా వేయొద్దని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికే హైకోర్టుల్లో విచారణలు వేగవంతం అవుతుండగా.. మరిన్ని ఉత్తర్వులిస్తూ పలు సూచనలు చేసింది. లీడర్లపై కేసులను ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చేయవద్దంటూ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ప్రజాప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసుల విషయంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నేతలపై విచారణ సాగించేందుకు ప్రత్యేక బెంచ్ లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ కేసుల్లో త్వరగా తీర్పులు వచ్చేలా చూడాలంటూ ప్రముఖ లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్ పై సుప్రీం చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపి కీలక ఆదేశాలిచ్చింది.
వెబ్ సైట్ లో వివరాలు
హైకోర్టులు, ప్రత్యేక బెంచ్ ల్లో నిర్వహించే విచారణ(Hearings)కు సంబంధించి వెబ్ సైట్ తయారు చేయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసుల వివరాలు, విచారణ నిర్వహణకు గల అంశాల కోసం వెబ్ సైట్ తయారు చేయాలని అన్ని రాష్ట్రాల హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక బెంచ్ ల్ని హైకోర్టులు ఏర్పాటు చేయడంతోపాటు CJల నేతృత్వంలో పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టుల్లో జరిగే విచారణను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలు అబ్జర్వ్ చేయడంతోపాటు విచారణను తెలుసుకోవచ్చని ఆదేశాలిచ్చింది.