Photo: The Times Of India
ఐదేళ్ల చిన్నారిని అపహరించడమే కాకుండా అత్యాచారం, హత్య చేసిన నరరూప రాక్షసుడికి తగిన శాస్తి జరిగింది. ఘోరమైన నేరానికి పాల్పడ్డారంటూ న్యాయస్థానం మరణశిక్ష (Death Sentenced) విధించింది. కేరళలో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కేరళలోని అళువాకు చెందిన అభం శుభం తెలియని ఐదు సంవత్సరాల చిన్నారిని.. అష్ఫాక్ ఆలం అనే వ్యక్తి ఆమె ఇంటి నుంచి ఎత్తుకెళ్లాడు. ఈ జులై 28న మధ్యాహ్నం 3 గంటలకు బాలికను అపహరించగా.. సాయంత్రం 5:30 గంటలకు పాప ప్రాణాలొదిలింది. పసిబాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన మానవ మృగం తీరును నిరసిస్తూ కేరళతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలు ఆవేదన చెందారు.. ఈ ఘటనపై అట్రాసిటీతోపాటు పోక్సో కేసు నమోదు చేసి నిందితుణ్ని అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు(Investigation) 100 రోజుల పాటు సాగింది.
చిల్డ్రన్స్ డే నాడే
ఈ నెల 9న ఇరుపక్షాల తుది వాదనలు విన్న ఎర్నాకులం అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు.. అష్ఫాక్ ను నేరస్థుడిగా నిర్ధారించారు. ఈ దారుణ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన న్యాయమూర్తి కె.సోమన్.. అష్ఫాక్ కు 5 జీవిత కాల శిక్షలు విధించడంతోపాటు రూ.7.20 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చారు. దయనీయ ఘటనకు పాల్పడ్డ 29 ఏళ్ల ఆలంపై ఎలాంటి కనికరం చూపాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. పాప ప్రాణాలు కోల్పోయిన తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న కేరళ పోలీసులు.. ఎట్టకేలకు నేరస్థుడికి శిక్ష వేయించగలిగారు. సరిగ్గా బాలల దినోత్సవమైన నవంబరు 14 నాడే ఈ తీర్పు రావడం విశేషంగా నిలిచింది.