Published 21 Nov 2023
ఇటీవలే భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ MP వివేక్ ఇళ్లపై IT, ED అధికారులు దాడులు నిర్వహించారు. సోమాజిగూడలో ఆయన ఇంట్లో విస్తృతంగా సోదాలు చేశారు. రెండు రోజుల క్రితం బ్యాంక్ అకౌంట్ లో నగదు బదిలీకి సంబంధించిన వ్యవహారంపై ఈ సోదాలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ తోపాటు కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాలలోనూ భారీగా సోదాలు నిర్వహించారు. మంచిర్యాలతోపాటు ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బెల్లంపల్లి సహా తొమ్మిది ప్రాంతాల్లోని ఆయన ఆఫీసుల్లో ఫైళ్లను పరిశీలించారు. వివేక్ కు సంబంధం ఉందని భావిస్తున్న వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల ఇళ్లల్లోనూ అధికారుల బృందాలు తనిఖీలకు దిగాయి. 5 గంటల పాటు అధికారులు సోదాలు చేపట్టడంతో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వివేక్ కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించిన ఖాతా నుంచి నిధులు బదిలీ అయిన వ్యవహారంపై ED, IT నజర్ పెట్టాయి.
మొన్నటివరకు BJPలో ఉన్న వివేక్ ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నెల 1న ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన చెన్నూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.