Published 26 Nov 2023
బాసర ట్రిపుల్ ఐటీ(RGUKT) మరో విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్న రామాటి ప్రవీణ్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. హాస్టల్ లోని నాలుగో అంతస్తులో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు గుర్తించారు. ఇతడి స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా కాగా.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భైంసా హాస్పిటల్ కు తరలించారు. టెన్త్ లో మండల స్థాయిలో టాపర్లుగా నిలుస్తూ ఇంజినీరింగ్ సీటు దక్కించుకుని ట్రిపుల్ ఐటీలో చేరుతున్న పిల్లలు.. ఇలా అనుమానాస్పద(Suspected) రీతిలో ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల కష్టాలను తొలగించాలంటే తాము బాగా చదివి భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలన్న లక్ష్యంతోనే అందులో చేరుతుంటారు. కానీ అక్కడి పరిస్థితులకు తట్టుకోలేక బంగారు భవిష్యత్తున్న విద్యా కుసుమాలు లక్ష్యం నెరవేరకుండానే కొరగాకుండా పోతున్నాయి.
ఏడాది కాలంలో ఐదుగురు మృత్యువాత
బాసర ట్రిపుల్ ఐటీలో ఏడాది కాలంలోనే ఐదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. PUC మొదటి సంవత్సరం చదువుతున్న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన జాదవ్ బబ్లూ హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన లిఖిత(17) నాలుగో ఫ్లోర్ నుంచి కిందపడింది. హాస్పిటల్ తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయింది. అది ప్రమాదమా, ఆత్మహత్యనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. లిఖిత మృతికి రెండు రోజుల ముందే దీపిక అనే అమ్మాయి ప్రాణాలు తీసుకుంది. సంగారెడ్డి జిల్లా కోటపల్లి మండలం గోరేకల్ కు చెందిన దీపిక బాత్రూంలో చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.