Published 27 Nov 2023
మరో BRS ఎమ్మెల్యే ఇంటిపై IT శాఖ నజర్ పడింది. ఎన్నికల కోసం తాయిలాలు సిద్ధం చేస్తున్నారన్న అనుమానంతో ఆదాయపన్ను విభాగం టీమ్ లు పెద్దయెత్తున రంగంలోకి దిగాయి. నారాయణపేట MLA రాజేందర్ రెడ్డి నివాసంలో IT అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. BRSకు చెందిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితోపాటు ఆయన ముఖ్య అనుచరుల ఇళ్లల్లోనూ పెద్దయెత్తున తనిఖీలు చేస్తున్నారు. నారాయణపేట డిగ్రీ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి, బంగారం వ్యాపారి హరినారాయణ్ భట్టాడ్, మరో వ్యాపారి బన్సీలాల్ లహోటి నివాసాల్లో పెద్దయెత్తున సోదాలు జరుగుతున్నాయి. వివిధ బృందాలుగా విడిపోయిన IT అధికారులు అందరి ఇళ్లల్లో ఏకకాలంలో దాడులకు దిగారు. తెల్లవారుజాము నుంచే ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తూ ఫైళ్లు, రికార్డులు పరిశీలిస్తున్నారు.
తాళం పగులగొట్టి నగదు స్వాధీనం
ఎన్నికల ప్రచారానికి గడువు ముగుస్తున్న దృష్ట్యా ఇక తాయిలాల కోసం రెడీ చేసుకుంటున్నారు కొందరు. మరో ఘటనలో పెద్దపల్లి జిల్లా రామగుండం(Ramagundam)లోని కృష్ణానగర్ లో సోదాలు నిర్వహించిన పోలీసులకు కళ్లు చెదిరే రీతిలో నగదు దొరికింది. ఇంట్లో డబ్బు దాచారన్న సమాచారంతో దాడులకు దిగిన పోలీసులు.. తాళం పగులగొట్టి మరీ రూ.2.18 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు ఎవరిది, ఎందుకోసం దాచారన్న కోణంలో విచారణ నిర్వహిస్తున్నారు. పట్టుకున్న నగదును IT(Income Tax) అధికారులకు అప్పగించనున్నారు.