Published 06 Dec 2023
నగరాలు సురక్షితంగా ఉంటేనే ప్రజల జీవనశైలి మెరుగుపడుతుంది. శాంతిభద్రతల పరిస్థితిని చూస్తే దేశ రాజధాని వంటి ప్రాంతాలే రక్షణ లేని ప్రాంతాలుగా ముద్ర పడ్డాయి. కానీ మినీ భారతదేశంగా(Mini India) భావించే హైదరాబాద్(Hyderabad).. ప్రజలు నివసించేందుకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉండటంతో మరోసారి మంచి ర్యాంకులో నిలిచింది. అందుకే ఈసారి టాప్-3లో నిలిచి ఔరా అనిపించింది. దేశంలో అత్యంత సురక్షిత నగరంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోలకతా వరుసగా మూడోసారి మొదటి స్థానం ఆక్రమించి రికార్డు సృష్టించింది. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో(NCRB) విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. గతేడాది ప్రతి లక్ష మందికి అత్యంత తక్కువగా నేరాలు నమోదైన నగరంగా కోల్ కతా ఫస్ట్ ప్లేస్ ను కంటిన్యూ చేస్తోంది. అక్కడ ప్రతి లక్ష మందికి అత్యల్ప స్థాయిలో కేవలం 86.5 కేసులు మాత్రమే రికార్డవుతున్నాయి. ఇక 280.7 కేసులతో మహారాష్ట్రలోని పుణె రెండో స్థానంలో నిలవగా.. 299.2 కేసులతో హైదరాబాద్ మూడో స్థానంలో ఉన్నట్లు NCRB ప్రకటించింది. ఇది 2021కి గాను కోల్ కతాలో 103.4, పుణెలో 256.8, హైదరాబాద్ లో 259.9గా ఉన్నాయి.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో
20 లక్షలకు పైగా జనాభా ఉన్న 19 మెట్రొపాలిటన్ నగరాల్లోని ఇన్ఫర్మేషన్ తో నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ఈ రిపోర్ట్ ను తయారు చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని నగరాలపై అధ్యయనం నిర్వహించిన NCRB.. ‘క్రైమ్ ఇన్ ఇండియా 2022’ పేరిట నివేదికను విడుదల చేసింది. 2022లో అత్యంత అల్లర్లు చోటుచేసుకున్న ప్రాంతంగా మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 8,218 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలవగా వరుసగా 4,736 కేసులతో బిహార్, 4,478 కేసులతో ఉత్తరప్రదేశ్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. 2022లో రాజస్థాన్ లో అత్యధికంగా 5,399 రేప్ కేసులు నమోదైనట్లు NCRB తెలిపింది.