అధికారంలో ఉన్నప్పుడు నాయకులను చూసీచూడనట్లు వదిలేసే అధికారులు.. అదను దొరికిందనగానే విరుచుకుపడుతుంటారు. ఇప్పుడు అచ్చంగా అదే సీన్ మాజీ MLA విషయంలో కనపడుతోంది. బకాయిలు చెల్లించాలంటూ ఇప్పటికే RTC నుంచి నోటీసులు అందుకున్న ఆర్మూర్ మాజీ MLA ఆశన్నగారి జీవన్ రెడ్డికి ఇప్పుడు మరో చిక్కు వచ్చి పడింది. బకాయి పడ్డ తమ నిధుల్ని కూడా వడ్డీతో సహా చెల్లించాలంటూ మరో సంస్థ సైతం నోటీసులు జారీ చేసింది. మొన్నటివరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన జీవన్ రెడ్డికి తాజాగా ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సైతం నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల్ని ఆయన ఇంటికి అధికారులు అంటించడం చర్చనీయాంశంగా మారింది.
ఆర్మూర్ లోని విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు APSFC నోటీసులు చేరాయి. ఆరున్నరేళ్ల కిందట రూ.20 కోట్లు తీసుకున్న రుణానికి సంబంధించిన నిధుల్ని వెంటనే చెల్లించాలని స్పష్టం చేసింది. 2017లో ఆయన రుణం తీసుకుని ఇప్పటివరకు చెల్లించలేదని AP స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తన నోటీసుల్లో తెలియజేసింది. రూ.20 కోట్ల లోన్ ను వడ్డీ, ఇతర ఖర్చులు కలిపి రూ.45.46 కోట్లు చెల్లించాలని స్పష్టం చేసింది. జీవన్ రెడ్డి మాల్ కు మేనేజింగ్ డైరెక్టర్(MD)గా ఆయన సతీమణి రజిత ఉండగా, ఆమె పేరుతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఆర్మూర్ లోని ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకున్న విష్ణుజిత్ సంస్థ.. జీవన్ రెడ్డి మాల్ పేరిట భారీ కాంప్లెక్స్ నిర్మించింది. బకాయిలు సుమారు రూ.10 కోట్లు చెల్లించకపోవడంతో ఆర్టీసీ నోటీసులు ఇవ్వగా.. విద్యుత్తు శాఖ కరెంటు నిలిపివేసింది.