Published 13 Dec 2023
పార్లమెంటు(Parliament)లో దాడి(Attack) ఘటనపై పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. నిందితులు ముందుగానే రెక్కీ నిర్వహించి, నాలుగేళ్లుగా పరిచయం పెంచుకుని మరీ ఘటనకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో ఆరుగురి పాత్ర ఉందని నిర్ధారించగా, ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలిస్తున్న పోలీసులు.. నిందితుల నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోలేదని చెబుతున్నారు. వీరంతా హరియాణా గురుగ్రామ్ లోని ఓ ఇంట్లో ఉండి రెక్కీ నిర్వహించారని గుర్తించారు. ఈ ఆరుగురూ సభ లోపలికి వెళ్దామని భావించినా ఇద్దరికి మాత్రమే పాస్ లు రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
ఈ ఆరుగురి ప్రమేయమేనా లేకా ఇంకెవరి హస్తమైనా ఉందా అన్న కోణంలోనూ విచారణ సాగిస్తున్నారు. లోక్ సభ విజిటర్స్ గ్యాలరీలో చాలా సేపు సైలెంట్ గా కూర్చున్న ఇద్దరు దుండగులు.. ఉన్నట్టుండి కిందకు దూకారని అక్కడివారు చెబుతున్నారు. విజిటర్స్ గ్యాలరీలో ఉన్నప్పుడు ఎలాంటి అనుమానం రాకుండా చూసుకున్నారని, ఆ టైమ్ లో అక్కడ 40 మంది దాకా ఉన్నట్లు తెలియజేశారు. అయిదంచెల భద్రత కలిగిన పార్లమెంటులో ఇలాంటి ఘటన జరగడంపై స్పీకర్ ఓం బిర్లా ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
అరెస్టైన సాగర్ శర్మది ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లఖ్ నవూ కాగా.. నీలమ్ హరియాణాలోని హిసార్ వాసి. లోక్ సభ ఛాంబర్ లోకి దూకిన మనోరంజన్ అనే వ్యక్తి.. BJP ఎంపీ ప్రతాప్ సింహ ఆఫీసుకు రెగ్యులర్ గా వెళ్లేవాడని గుర్తించారు. మూడు నెలలుగా పాస్ ఇప్పించాలని MPని కోరుతుండగా, చివరకు ప్రతాప్ సింహ ఆఫీసు నుంచి పర్మిషన్ లభించింది. ఇందుకు కారకుడైన సదరు ఎంపీపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.