
Published 20 Dec 2023
బిగ్ బాస్ షో అంటేనే అందరికీ దూరంగా ఉండి కేవలం హౌజ్ లోని టీమ్ మేట్స్ తోనే ఆనందాన్నైనా, బాధనైనా పంచుకోవాల్సి ఉంటుంది. ఒకరకంగా కొన్ని రోజులపాటు నిర్బంధాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అనధికారికంగా నిర్బంధాన్ని అనుభవించిన అతడు.. ఇప్పుడు అధికారికంగా కటకటాలకు వెళ్లే నిర్బంధంలో చిక్కుకున్నాడు. అన్ని అంశాల్లో ప్రతిభ(Talent) చూపి విజేతగా అవతరించినా ఆ ‘ప్రశాంత’తను అందుకోలేకపోయాడతను. ఫైనల్ ఎపిసోడ్ అయిపోగానే జరిగిన ఓవరాక్షన్ పై పోలీసులు కొరడా ఝుళిపించారు. రైతుబిడ్డగా బిగ్ బాస్ షోలోకి ఎంటరై సెన్సేషన్ క్రియేట్ చేసిన పల్లవి ప్రశాంత్.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన పరిణామాలతో ఆయనపై కేసు నమోదైంది. గజ్వేల్ మండలం కొల్గూరులోని ఆయన ఇంటిలో ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ ఫైనల్ సందర్భంగా జరిగిన ఘటనలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ కాగా.. ప్రశాంత్ తోపాటు ఆయన తమ్ముడు మహావీర్ ను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ ఠాణాకు తరలించారు.
అసలేం జరిగిందంటే…
బిగ్ బాస్ సీజన్-7 ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ అయిపోగానే విన్నర్ పల్లవి ప్రశాంత్.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-5లోని అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తూ ర్యాలీ తీశాడు. ఈ ర్యాలీకి పర్మిషన్ లేకపోగా, అదే సమయంలో అక్కడ పెద్ద గొడవ జరిగింది. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ అనుచరుల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీయగా.. పోటాపోటీగా కార్ల అద్దాలు ధ్వంసం చేసుకున్నారు. అటుగా వెళ్తున్న ఐదుకు పైగా RTC బస్సులనూ లక్ష్యంగా చేసుకుని అద్దాలను పగులగొట్టారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ACP కారుతోపాటు పోలీస్ బెటాలియన్ కు చెందిన బస్సును టార్గెట్ చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా ర్యాలీ కంటిన్యూ చేసినందుకు ప్రశాంత్ తోపాటు ఆయన డ్రైవర్ సహా నలుగురిపై కేసులు ఫైల్ చేశారు. ఈ కేసులో A1గా ప్రశాంత్ పేరు, A2గా ఆయన సోదరుడు పేర్లను చేర్చుతూ బిగ్ బాస్ విన్నర్ కోసం వేట సాగించారు. మొత్తంగా అందరినీ గెలిచి టైటిల్ సాధించినా.. ఆనందంలో చూపించిన అత్యుత్సాహం అసలుకే ఎసరు తెచ్చి కటకటాలు లెక్కపెట్టాల్సి వచ్చింది.