తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపై క్రూరమృగాల దాడి దృష్ట్యా TTD పలు నిర్ణయాలు తీసుకుంది. నడక దారిలో వైల్డ్ లైఫ్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నామని, అందులో యానిమల్ ట్రాకర్స్ తోపాటు డాక్టర్లు ఉంటారని TTD ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. చిరుతలు, ఇతర అటవీ జంతువుల సంచారం, కల్పించాల్సిన భద్రతపై TTD.. సమావేశం నిర్వహించింది. మూడు రోజుల క్రితం ఆరేళ్ల బాలికను చిరుతపులి పొట్టనపెట్టుకున్న సందర్భంగా సోమవారం సైతం చిరుతపులి, ఎలుగుబంటి సంచరించాయి. ఈరోజు పొద్దున వైల్డ్ లైఫ్ అధికారులు భేటీ కాగా.. మధ్యాహ్నం TTD మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. దారి పొడవునా ఫోకస్ లైట్లు అమర్చాలని, రెండు వైపులా 30 అడుగుల పరిధిలో వీటిని ఏర్పాటు చేయబోతున్నామని భూమన తెలిపారు.
ఈ భేటీలో ఫెన్సింగ్ ఏర్పాటుపై తీవ్రమైన చర్చ జరిగింది. అయితే అటవీ చట్టాలు బలంగా ఉన్నందున దీనిపై నిర్ణయాన్ని కేంద్ర అటవీశాఖకే వదిలేశామన్నారు. ఫెన్సింగ్ పై ఫారెస్టు అధికారులు ప్రాథమిక వివరాలు చెప్పారని, కానీ కేంద్ర ఉన్నత స్థాయి కమిటీ నిర్వహించే అధ్యయనం అనంతరం ఇచ్చే రిపోర్ట్ మేరకు దీనిపై నిర్ణయం తీసుకుంటామని TTD ఛైర్మన్ స్పష్టం చేశారు. అలిపిరి, గాలిగోపురం, ఏడవ మైలు వద్ద నోటీస్ బోర్డులు, లఘు చిత్రాలు, వీడియో షోల ద్వారా జాగ్రత్తల్ని తెలియజేస్తామన్నారు. భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శనం టోకెన్లు పొందిన వారిని గాలి గోపురం వద్ద చెక్ చేసే విధానాన్ని తీసివేస్తున్నామన్నారు.
భూదేవి కాంప్లెక్స్ టోకెన్లు తీసుకున్న తర్వాత నడిచి వెళ్లాలా, వాహనాల్లో వెళ్లాలా అనేది అక్కడే భక్తులు నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పించేందుకే గాలి గోపురం వద్ద చెకింగ్ సిస్టమ్ ను తొలగిస్తున్నామన్నారు.
వన్యప్రాణులకు ఆహారం పెట్టకూడదని TTD ఛైర్మన్ సూచించారు. మధ్యాహ్నం వరకే పిల్లలకు నడక మార్గంలో అనుమతిస్తున్నామని, 2 గంటల తర్వాత వారికి నో పర్మిషన్ అని ప్రకటించారు.