మహిళా సంపన్నుల వివరాలు వెల్లడిస్తూ ఫోర్బ్స్ ఇచ్చిన 100 మంది లిస్టులో నలుగురు భారత సంతతి అతివలు చోటు సంపాదించారు. వ్యక్తిగత ఆస్తుల విలువ, కంపెనీల్లో వారికి గల వాటాల ఆధారంగా ఈ లిస్ట్ తయారు చేసినట్లు ఫోర్బ్స్ తెలిపింది. 2.4 బిలియన్ డాలర్లతో జయశ్రీ ఉల్లాల్ 15వ స్థానంలో నిలిచారు. ఆమె 2008 నుంచి అరిస్టా నెట్ వర్క్ ప్రెసిడెంట్, CEOగా ఉన్నారు. ఆ సంస్థలో జయశ్రీకి 2.4 శాతం వాటా ఉన్నట్లు ప్రకటించింది. సింటెల్ కో ఫౌండర్ అయిన నీర్జా సేథీ 990 మిలియన్ డాలర్లతో 25వ స్థానాన్ని ఆక్రమించారు. భర్త దేశాయ్ తో కలిసి నీర్జా సేథీ 1980లో సింటెల్ కంపెనీ ప్రారంభించగా… వాటా కింద 510 మిలియన్ డాలర్లు పొందినట్లు ఫోర్బ్స్ తెలిపింది.
గతంలో లింక్డ్ ఇన్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశాక దాన్నుంచి బయటకు వచ్చి కాన్ ఫ్లూయెంట్ ను స్థాపించిన నేహా నార్ఖడే 520 మిలియన్ డాలర్ల సంపదతో 50వ స్థానాన్ని దక్కించుకున్నారు. మరో ఇద్దరితో కలిసి 2014లో స్టార్ట్ చేసిన కాన్ ఫ్లూయెంట్ కంపెనీలో నేహాకు 6 శాతం వాటా ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది. పెప్సికో నుంచి రిటైరైన ఇంద్రా నూయీ 350 మిలియన్ డాలర్లతో 77వ స్థానంలో ఉన్నారు. 24 సంవత్సరాల పాటు టాప్ పొజిషన్లో ఉన్న ఇంద్రాకు 350 మిలియన్ డాలర్ల సంపద ఉన్నట్లు ఫోర్బ్స్ ప్రకటించింది.