గతవారం రిలీజైన ‘ఆదిపురుష్’ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక జూన్ 29న ఒకటి రెండు చిత్రాలు విడుదలవుతున్నా వాటిపై పెద్దగా బజ్ లేదు. ఇక ఆగస్టులోనూ మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజినీకాంత్, పవర్‌స్టార్ ‘బ్రో’ సినిమాలు లైన్లో ఉన్నాయి. అయితే సెప్టెంబర్‌లో మాత్రం ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవగా.. అవన్నీ క్రేజీ చిత్రాలే కావడం విశేషం. విజయ్ దేవరకొండ ‘ఖుషి’, షారుఖ్ ఖాన్ జవాన్, సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’, బోయపాటి-రాపో మూవీతో పాటు ప్రభాస్ ‘సలార్’ మూవీ సైతం ఈ లిస్టులో ఉన్నాయి.
ఈ ఐదు చిత్రాల్లో విజయ్, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఖుషి’ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. ఫ్లాప్స్‌లో ఉన్న ఈ ముగ్గురి కెరీర్‌కు ఈ సినిమా విజయం చాలా కీలకం కానుంది. ఇప్పటికే విడుదలైన ‘నా రోజా నువ్వే’ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలవగా.. సెప్టెంబర్ 1న ఐదు భాషల్లో విడదలవనుంది. ఇక ‘పఠాన్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో కింగ్ ఖాన్ షారుఖ్ ‘జవాన్’ చిత్రంపైనా భారీ అంచనాలున్నాయి. సౌత్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం కూడా ఈ క్రేజ్‌కు మరొక కారణం. జవాన్ మూవీ సెప్టెంబర్ 7న హిందీ, తమిళం, తెలుగులో విడుదల కానుంది.
సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ సినిమాపై టాలీవుడ్లో ఎలాంటి క్రేజ్ ఉందో తెలియంది కాదు. ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన రొమాంటిక్ పోస్టర్ ఈ మూవీ స్టఫ్ గురించి హింట్ ఇచ్చేసింది. మరోవైపు రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అన్టైటిల్డ్ ఫిల్మ్ సైతం సెప్టెంబర్ 15నే ప్రేక్షకుల ముందుకొస్తోంది. కాగా ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి.
ఇక అన్నింటి కంటే మించి సెప్టెంబర్ 28న ప్రభాస్ నటించిన ‘సలార్’ రిలీజ్ కానుంది. ఇది కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. పైగా ఆదిపురుష్ మూవీ కొన్ని వర్గాలను నిరాశపరిచిన నేపథ్యంలో ‘సలార్’ మూవీపైనే ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. మరి ఈ ఐదు చిత్రాల్లో ఏవి బాక్సాఫీస్ కింగ్ అనిపించుకుంటాయో? చూడాల్సిందే.