69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. 2021కి గాను ప్రకటించిన అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ‘పుష్ప-1’ మూవీలో యాక్టింగ్ కు గాను ఆయనకు ఈ అవార్డు సొంతమైంది. ఇక ఉత్తమ నటిగా అలియాభట్ నిలిచారు. తెలుగు చిత్రాలకు మొత్తం 10 అవార్డులు సొంతమయ్యాయి. ‘RRR’ చిత్రానికి ఆరు, పుష్ప మూవీకి 2 అవార్డులు దక్కాయి. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ గా ‘RRR’, బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా కింగ్ సోలోమన్ ‘RRR’, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ ‘RRR’, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ గా శ్రీనివాస్ మోహన్ ‘RRR’, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు గాను MM కీరవాణి ‘RRR’, ఉత్తమ నేపథ్య గాయకుడు కాలభైరవ ‘RRR’కు అవార్డులు సొంతమయ్యాయి. ఇప్పటికే ఆస్కార్ అవార్డు సాధించిన ‘RRR’ మూవీ… జాతీయ స్థాయిలోనూ పలు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది.
ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ ఎంపికైంది. ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్(కొండ పొలం), ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్(పుష్ప-1) నిలిచారు. ఇక జాతీయ ఉత్తమ చిత్రంగా ‘రాకెట్రీ’ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఉత్తమ నేపథ్య గాయనిగా శ్రేయ ఘోషల్, ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా ‘కశ్మీర్ ఫైల్స్’, ఉత్తమ చిత్ర విమర్శకుడు పురుషోత్తమాచార్యులు(తెలుగు) అవార్డులు వరించాయి.
‘అల్లు’ ఇంట సందడి
69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో ఎవరూ సాధించని రికార్డును అల్లు అర్జున్ అందుకున్నారు. ‘తగ్గేదేలే అన్న మేనరిజాన్ని పండించిన పుష్ప మూవీ.. వసూళ్లలో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు 1997లో స్పెషల్ జ్యూరీ కేటగిరీలో నాగార్జున అవార్డును స్వీకరించగా.. స్ట్రెయిట్ గా జాతీయ నటుడిగా అవార్డు దక్కింది మాత్రం ఈ 69 ఏళ్లలో ఇదే ప్రథమం. అవార్డుకు అల్లు అర్జున్ సెలెక్ట్ కాగానే ఆయన ఇంట సందడి నెలకొంది. డైరెక్టర్ సుకుమార్ తోపాటు మూవీ టీమ్ అందరూ అక్కడకు చేరుకున్నారు. టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.