రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది 130 రోజుల పాలన అయితే… అవినీతి నిరోధక శాఖ(Anti Corruption Bureau) 100 రోజుల షోను పూర్తి చేసుకుంది. ఈ హండ్రెడ్ డేస్ ‘షో'(Hundred Days Show)లో తిమింగలాలతోపాటు పెద్ద చేపల పాత్రా బయటపడింది. అక్రమ వ్యవహారాలు వెలుగుచూడటమే కాదు ఏకంగా వారిని పట్టించేలా చేసింది. అంతలా దూసుకుపోతున్న ACB.. అన్ని డిపార్ట్మెంట్లపై డేగ కన్ను వేసింది.
రెండ్రోజులకొకటి…
ఈ వంద రోజుల్లో 55 మంది అధికారులు పట్టుబడితే(Caught) రానున్న రోజుల్లో ఈ సంఖ్య ఎంతలా ఉంటుందన్నది ఆశ్చర్యకరంగా తయారైంది. ACB లెక్కల ప్రకారం సగటున(Average)గా లెక్కేస్తే రెండ్రోజులకు ఒకరు దొరికిపోతున్నారు. మామూలుగా అయితే 4 రోజులకు ఒక కేసు ఫైల్ అవుతుండగా.. ఒకే రోజు ఇద్దరు, ముగ్గురు చిక్కిన సందర్భాలుంటున్నాయి. నిన్న(ఏప్రిల్ 15న) ముగ్గురు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం.
లంచం డిమాండ్ చేసి నగదు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా కొంతమంది, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మరికొంతమంది అవినీతి నిరోధక శాఖకు దొరికిపోయారు. ముఖ్యంగా కీలక డిపార్ట్మెంట్లయిన పోలీసు, రెవెన్యూల్లోనే ఎక్కువ మంది పట్టుబడుతున్నారు. మీర్ పేట్ SI, మాదాపూర్ సబ్ ఇన్స్ పెక్టర్ సహా స్టేషన్ రైటర్, ఆసిఫాబాద్ ఎస్సై ఇలా అందరూ అమ్యామ్యాలు తీసుకుంటూ పట్టుబడ్డారు.
నిన్న స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.25 వేలు తీసుకుంటూ ఆసిఫాబాద్ SI రాజ్యలక్ష్మీ… డ్రైవర్ పై ఛార్జి మెమో ఎత్తివేసేందుకు రూ.20 వేలు అందుకుంటూ హుజూరాబాద్ RTC డిపో మేనేజర్ శ్రీకాంత్… నల్గొండలో మెడికల్ షాప్ పర్మిషన్ కోసం రూ.18 వేలు తీసుకుంటూ డ్రగ్ ఇన్స్ పెక్టర్ సోమేశ్వర్ ACBకి చిక్కారు. వీళ్లే కాదు.. ఇలాంటి వాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు.
‘ధరణి’ లోపాల్ని అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా సంపాదించిన అధికారులూ కోట్లకు కోట్లు కూడబెట్టుకున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇళ్ల స్థలాలు, భూములు కొనుక్కొని దర్జా అనుభవిస్తున్నారు. అలాంటి అధికారుల భరతం పట్టేందుకు సైతం ACB దృష్టిసారించాల్సిన అవసరముంది. కొన్ని జిల్లాల్లో తహసీల్దార్లు, RDO స్థాయి అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు.
హై(పై)లెవెల్లో ఇలా…
ఇప్పటిదాకా పైస్థాయిలో పట్టుబడ్డవారు కొంతమంది ఉన్నారు. అందులో HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగజ్జ్యోతి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సహా నలుగురు వ్యక్తులు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఊచలు(Jail) లెక్కబెడుతున్నారు. అధికారులు లంచం డిమాండ్ చేస్తే 1064 ట్రోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయాలని చెబుతున్నది అవినీతి నిరోధక శాఖ.