లంచం డిమాండ్ చేసిన కేసులో ఓ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖ(ACB)కి చిక్కాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ CIగా పనిచేస్తున్న నరేందర్ ను అధికారులు వల పన్ని పట్టుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తోపాటు ఆయన ఇంటిలోనూ తనిఖీలు చేశారు. అక్కడి పబ్ యజమాని నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. రూ.3 లక్షలు డిమాండ్ చేసి వాటిని అందుకుంటున్న సమయంలో ACB అధికారులు దాడి చేశారు. ముందస్తు సమాచారంతోనే CI నరేందర్ ను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పబ్ యజమాని ఫిర్యాదుతో సీఐపై కేసు ఫైల్ చేశారు.
ఇంతకముందే పబ్ సీజ్ చేసిన సీఐ
యువతులతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నారంటూ సదరు పబ్ ను సీఐ నరేందర్ సీజ్ చేశారు. పబ్ ను తిరిగి ఓపెన్ చేయాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు Anti Corruption Bereau అధికారులకు కంప్లయింట్ ఇచ్చాడు. సీఐ, ఎస్ఐ, హోంగార్డ్ టార్చర్ భరించలేక ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. తమపైనే కంప్లయింట్ ఇస్తావా అంటూ మరింత ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిపిన బాధితుడు.. వేధింపులు తట్టుకోలేకే మరోసారి ACBని ఆశ్రయించానన్నాడు.
గతంలో నల్గొండ జిల్లాలో పనిచేసి
ACBకి పట్టుబడ్డ బంజారాహిల్స్ CI నరేందర్ ఇంతకుముందు నల్గొండ జిల్లాలో పనిచేశారు. 15 నెలల క్రితమే ఆయన బంజారాహిల్స్ ఇన్స్ పెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. పట్టుబడ్డ ఇన్స్ పెక్టర్ ను ACB విచారణ చేస్తున్నది. ఈ కేసులో SI నవీన్ రెడ్డి, హోంగార్డును హరిపై సైతం విచారణ కొనసాగుతున్నది.