Published 24 Jan 2024
అతడు చేసే ఉద్యోగం.. పట్టణ ప్రణాళిక డైరెక్టర్(Town Planning Director). పెద్దయెత్తున అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ(Anti Corruption Bereau) పెద్దయెత్తున దాడులకు దిగింది. ఇంకేముంది.. ఇన్నాళ్లూ దాచుకున్నదంతా గుట్టలు గుట్టలుగా బయటపడటంతో అధికారులే నోరు తెరిచారు. బంగారం, వెండి, నగదు వెలుగుచూడగా.. మరిన్ని ప్రాంతాల్లోనూ సోదాలు చేయాలన్న ఆలోచనలో ACB టీమ్ లున్నాయి. HMDA టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా, రెరా కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు(Full Additional Charge) నిర్వర్తిస్తున్న సి.బాలకృష్ణ నివాసాల్లో పొద్దున్నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
వామ్మో… వంద కోట్లా…
బాలకృష్ణ నివాసంలో ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా స్థిర, చరాస్తుల్ని అధికారులు గుర్తించగా, వాటన్నింటినీ బినామీ పేర్లపై ఉంచారని నిర్ధరించుకున్నారు. హైదరాబాద్ మణికొండలోని ఆదిత్య విల్లాస్ లో ఉంటున్న బాలకృష్ణ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. మొత్తం 14 టీమ్ లతో అధికారులు కంటిన్యూగా దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ తనిఖీల్లో 15 ఐఫోన్లు, 10 ల్యాప్ టాప్ లు, లక్షల్లో నగదు గుర్తించారు. ఆయన కుటుంబానికి నాలుగు ప్రధాన బ్యాంకు లాకర్లు ఉన్నట్లు తేల్చిన అధికారులు… వాటిని పరిశీలించబోతున్నారు. మణికొండతోపాటు మాసాబ్ ట్యాంక్ లోని రెరా కార్యాలయం సహా ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి.