MLC కల్వకుంట్ల కవిత కేసు సుప్రీంకోర్టు(Supreme Court)లో మరోసారి వాయిదా పడింది. ఈ కేసును వచ్చే నెల(మార్చి) 13న విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. ఆమె పిటిషన్ ను మరో ఇద్దరైన నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీల కేసులకు జత చేసి విచారణ చేపడతామని గతంలో తెలియజేసినా.. ఆయా(మూడు) పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపడతామని ఈ మధ్యనే ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం(Devision Bench) కవిత కేసుపై విచారణ చేపట్టనుంది. 3 కేసులు వేర్వేరని స్పష్టం చేసిన బెంచ్.. వాటన్నింటిని కలిపి విచారణ చేయడం సబబు కాదని అభిప్రాయపడింది.
ఈ రోజు రావాల్సి ఉన్నా…
ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు రావాలంటూ ED(Enforcement Directorate) పంపిన సమన్లను ఆమె సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. మహిళలను ఆఫీసుల్లోకి పిలవకుండా దర్యాప్తు సంస్థలు.. ఇళ్లల్లోనే విచారించాలంటూ BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంతకుముందే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు వాస్తవానికి ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రావాల్సి ఉంది. అయితే కోర్టు సమయం ముగిసినా కేసు విచారణకు రాకపోవడంతో.. కవిత తరఫు లాయర్ కపిల్ సిబల్ ఈ అంశాన్ని న్యాయమూర్తుల ఎదుట ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సీబీఐ సమన్లతో…
EDతోపాటు CBI కూడా సమన్లు జారీ చేయడం వల్ల కేసు విచారణను త్వరగా జరపాలని కపిల్ సిబల్ జడ్జీలకు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ కేసు విచారణను మార్చి 13నాడే చేపడతామంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. APకి చెందిన YCP ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బినామీలైన అరుణ్ రామచంద్ర పిళ్లై, ప్రేమ్ రాహుల్ కు చెందిన సౌత్ గ్రూప్ ద్వారా… ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లకు ముడుపులు చెల్లించారన్నది కేసు సారాంశం. రూ.100 కోట్ల ముందస్తు ముడుపులు చెల్లించి మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా ఉండేలా కల్వకుంట్ల కవిత ప్రభావితం చేశారన్నది ED అభియోగం. అయితే చట్ట ప్రకారం మహిళల్ని ఇంట్లోనే విచారించాల్సి ఉన్నా ఆఫీసుకు ED పిలవడాన్ని సవాల్ చేస్తూ కవిత.. 2023 మార్చి 14న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.