రాష్ట్రంలో సంచలనానికి కారణంగా నిలిచిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు ASP(Additional Superintendent Of Police) స్థాయి అధికారుల్ని అరెస్టు చేసిన పోలీసులు… మరో ముగ్గురిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ ముగ్గురూ విదేశాలకు పారిపోయారన్న కోణంలో ఈ లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. హార్డ్ డిస్క్ ల ధ్వంసంలో ఇప్పుడు అరెస్టైన ఇద్దరు ASPలదే కీలక పాత్ర అని దర్యాప్తు టీమ్ భావిస్తున్నది.
ఆ ముగ్గురు వీరే…
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో DSP ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారణలో వేగం పెరిగింది. ఏడు రోజుల కస్టడీలో అతడిచ్చిన సమాచారం(Information) మేరకు ముగ్గురిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ కు కళ్లు, చెవులుగా భావించే కీలక పోస్టు అయిన ఇంటెలిజెన్స్(ISB) చీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ రావుతోపాటు టాస్క్ ఫోర్స్(Taskforce) మాజీ DCP రాధాకిషన్ రావు, టెలివిజన్ ఛానల్ అధినేత శ్రవణ్ రావు కోసం వేట కొనసాగుతున్నది. మూసీ నదిలో పడేసిన హార్డ్ డిస్క్ లను ఇప్పటికే స్వాధీనం చేసుకోగా, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్లు భావిస్తుండగా.. వారిని పట్టుకునేందుకు లుక్ అవుట్ నోటీసుల్ని జారీ చేశారు.
ఇద్దరి అరెస్ట్…
ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అడిషనల్ SPలను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. గతంలో ఇంటెలిజెన్స్ లో పనిచేసిన తిరుపతన్న, భుజంగరావును అదుపులోకి తీసుకుని తొలుత గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వీరిని కొంపల్లిలోని నాంపల్లి కోర్టు జడ్జి నివాసానికి తీసుకెళ్లి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం భూపాలపల్లి అదనపు SPగా భుజంగరావు, CSWలో తిరుపతన్న పనిచేస్తుండగా… అంతకుముందే వీరి ఇళ్లల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ ఇరువురు హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసినట్లు ఇన్వెస్టిగేషన్ టీమ్ నిర్ణయానికి వచ్చింది.
భుజంగరావు గతంలో…
భుజంగరావు గతంలో భువనగిరి DCPగా పనిచేశారు. ఆ సమయంలోనే హాజీపూర్ జంట హత్య కేసులు సంచలనం సృష్టించాయి. బడికి వెళ్లి తిరిగివస్తున్న బాలికల్ని బైక్ పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారం, హత్య చేసిన కేసులో శ్రీనివాస్ రెడ్డి అనే దుండగుడికి నల్గొడ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసుకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్(IO)గా భుజంగరావే ఉన్నారు.