అసలు పేర్లు ముసావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ తాహ. కానీ షానవాజ్ పటేల్, బి.డి.విగ్నేష, అన్మోల్ కులకర్ణి, సంజయ్ అగర్వాల్, ఉదయ్ దాస్.. ఇవి నకిలీ పేర్లు. ఇలా తప్పుడు పేర్లు, ఫేక్ ఐడీలు, తరచూ హోటళ్ల మార్పుతో బెంగళూరు బాంబు పేలుళ్ల కేసు దుండగులు నడిపిన వ్యవహారాలివి. రామేశ్వరం కేఫ్ లో మార్చి 1న జరిపిన పేలుడులో తొమ్మిది మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. వీరిపై ఇప్పటికే రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన NIA(National Investigation Agency) అధికారులు.. తాజాగా వారిద్దరినీ పశ్చిమబెంగాల్ లో అరెస్టు చేశారు. వీరిని పట్టుకోవడం వెనుక పెద్ద తతంగమే నడిచింది. ఒకానొక దశలో NIA అధికారులపై దాడి కూడా జరిగింది.
తతంగం ఇలా…
పేలుళ్లు(Blasts) జరిగిన 42 రోజులకు ఇద్దరు దుండగుల్ని NIA ఆధ్వర్యంలోని ఆపరేషన్ టీమ్స్ అరెస్టు చేశాయి. బాంబు పెట్టిన ముసావిర్ హుస్సేన్ షాజిబ్, మాస్టర్ ప్లాన్ వేసిన అబ్దుల్ మతీన్ తాహను అదుపులోకి తీసుకున్నాయి. బెంగాల్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారంతో దుండగుల్ని పట్టుకున్నాయి. బెంగాల్ లోని న్యూ దిఘా పట్టణంలో తలదాచుకున్నారని పసిగట్టాయి భద్రతా దళాలు. ఈ విషయాన్ని తూర్పు మిడ్నపూర్ SP సౌమ్యదీప్ భట్టాచార్యకు కేవలం 2 గంటల ముందుగానే NIA సమాచారమిచ్చింది.
ఇక ఆ తర్వాత…
బెంగాల్ పోలీసులతో NIA టీమ్ ఈస్ట్ మిడ్నపూర్ జిల్లాలో రైడ్(Raid)కు బయల్దేరింది. అయితే స్థానికులపై దాడి చేస్తున్నారంటూ మమతా బెనర్జీ సర్కారు గందరగోళం సృష్టించడంతోపాటు దర్యాప్తు సంస్థపై విమర్శలు చేసింది. ఏకంగా NIA వాహనంపై అక్కడివారు దాడి చేయడంతో ఒక అధికారికి గాయాలయ్యాయి. అబ్దుల్ మతీన్, ముసావిర్ తోపాటు గతంలో పేలుళ్లకు పాల్పడ్డ మునీర్ అహ్మద్ కోసం వేట నడిచింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ కు చెందిన యుషా షానవాజ్ పటేల్ గా షాజిబ్, కర్ణాటకకు చెందిన బి.డి.విగ్నేషగా, ఇంకో చోట అన్మోల్ కులకర్ణిగా మతీన్ పేర్లు మార్చుకున్నారు. మరో హోటల్లో ఈ ఇద్దరూ జార్ఖండ్, త్రిపురకు చెందిన సంజయ్ అగర్వాల్, ఉదయ్ దాస్ గా చలామణి అయ్యారు.
చరిత్ర ఇదే…
తాహా, సాజిబ్ కర్ణాటకలోని శివమొగ్గకు చెందివారు. తాహా IT ఇంజినీర్ కాగా, సాజిబ్ ఇస్లామిక్ స్టేట్(IS) సదరన్ మాడ్యుల్లోని శివమొగ్గ బేస్డ్ గా ఉగ్ర కార్యకలాపాల్లో పనిచేస్తున్నాడు. ఈ ఇద్దరూ పేలుడు జరిగిన తర్వాత చెన్నైలో ఉండి 12 రోజులకు కోల్ కతా చేరారు. లొకేషన్లు మార్చుతూ దక్షిణాది రాష్ట్రాల్లో తిరిగారు. క్రిప్టో కరెన్సీ ఆధారంగా డబ్బులు సేకరించి పేలుళ్లకు పాల్పడ్డ దుండగులు ప్రజల గుర్తింపు కార్డులను దొంగిలించి వాటిని వాడుకున్నట్లు NIA గుర్తించింది. ఈ ఇద్దరిని మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ కు అప్పగిస్తూ కోల్ కతా NIA కోర్టు ఆదేశాలిచ్చింది.