మావోయిస్టు సానుభూతిపరుడి(Naxal Sympathizer)గా ఆరేళ్ల నుంచి జైలు జీవితం గడుపుతున్న ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. గడ్చిరోలి సెషన్స్ కోర్టు తీర్పును కొట్టివేస్తూ ఆయనకు విధించిన జీవిత ఖైదు శిక్షను బాంబే హైకోర్టులో భాగమైన నాగ్ పూర్ బెంచ్ రద్దు చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతోపాటు ఢిల్లీలోని ఆయన ఇంట్లో నక్సల్స్ సాహిత్యం దొరకడం సహా దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారంటూ ఆయన్ను అరెస్టు చేశారు. కేసును విచారించిన గడ్చిరోలి సెషన్స్ కోర్టు.. 2017లో సాయిబాబాను దోషిగా తేల్చి జీవిత ఖైదు(Life Imprisonment) విధించింది.
వీల్ ఛైర్ కే…
అనారోగ్యంతో వీల్ ఛైర్ కే పరిమితమైన సాయిబాబా ప్రస్తుతం నాగ్ పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. గడ్చిరోలిలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి సూర్యకాంత్ షిండే ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయిస్తే.. 2022 అక్టోబరు 14న నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర సర్కారు సుప్రీంలో పిటిషన్ వేసింది. బాంబే హైకోర్టు తీర్పును పక్కనపెట్టిన సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) మరోసారి విచారణ జరపాలంటూ అదే బాంబే హైకోర్టును ఆదేశించింది. దీంతో తిరిగి విచారణ జరిపిన జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి మెనెజెస్ తో కూడిన నాగ్ పూర్ డివిజన్ బెంచ్.. ప్రొ.సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.
ఢిల్లీ ప్రొఫెసర్ పట్ల…
ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా అరెస్టు నుంచి విచారణ దాకా మహారాష్ట్ర పోలీసుల తీరుగా సరిగా లేదని కోర్టు అభిప్రాయపడింది. ఉపా(UAPA) చట్టంలోని సెక్షన్ 45(1) కింద కేసు పెట్టి ఆధారాలు చూపకపోవడం మహారాష్ట్ర హోంశాఖ వైఫల్యమని తీర్పులో తెలియజేసింది. కేసులో ఏ1 నిందితుడు మహేశ్ కరిమన్ టిక్రీ, ఏ3 హేమ్ కేశవదత్త మిశ్రా, ఏ4 ప్రశాంత్ రాహి నారాయణ్ సాంగ్లీకర్, ఏ5 విజయ్ టిక్రీ, ఏ6 సాయిబాబాను నిర్దోషులుగా ప్రకటించింది. ఏ2 అయిన పాండు పొరా నరొటే.. విచారణ సమయంలోనై స్వైన్ ఫ్లూతో ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తో విచారణ జరిపి శిక్ష పడ్డ మహారాష్ట్ర తొలి కేసుగా ఇది అప్పట్లో సంచలనానికి కారణమైంది.