బోధన్ మాజీ శాసనసభ్యుడు(MLA) షకీల్ తనయుడు, BRS నేత సాహిల్ అలియాస్ రహీల్ ను పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ లో అడుగుపెట్టగానే అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రజా భవన్(Praja Bhavan) గోడల్ని కారుతో బద్ధలు కొట్టిన కేసులో మాజీ MLA షకీల్ తనయుడు సాహిల్ పై పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో అతణ్ని మూడున్నర నెలల తర్వాత పోలీసులు పట్టుకోగలిగారు.
సాహిల్ అలియాస్ రహీల్.. ర్యాష్ డ్రైవింగ్ తో ప్రజాభవన్ గేట్లను బద్ధలు కొట్టిన ఘటనలో బారికేడ్లు ధ్వంసమయ్యాయి. కారులో సాహిల్ తోపాటు అమ్మాయిలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. గత డిసెంబరు 23న అర్థరాత్రి ఘటన జరిగిన సమయంలోనే అందర్నీ అదుపులోకి తీసుకున్నారు. అదే రాత్రి నిందితుణ్ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించిన కొద్దిసేపటికే షకీల్ అనుచరులు అక్కడకు చేరుకుని సాహిల్ పేరును FIRలో చేర్చొద్దంటూ అతణ్ని తీసుకెళ్లిపోయారు. నిందితుడి స్థానంలో షకీల్ ఇంట్లో పనిచేసే వ్యక్తి అసిఫ్ పేరును FIRలో చేర్చారు.
CP సునిశిత ఎంక్వయిరీ…
హైదరాబాద్ CP శ్రీనివాస్ రెడ్డి సీరియస్ గా తీసుకోవడంతోపాటు పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేయించారు. CC ఫుటేజ్ ఆధారంగా విచారణ చేశాక నిందితుణ్ని కావాలనే తప్పించారంటూ CI దుర్గారావును వెంటనే సస్పెండ్ చేశారు. ఈయనతోపాటు పంజాగుట్ట PSలోని మొత్తం 85 మంది పోలీసులపై వేటు పడింది.
సాహిల్ అదే రాత్రి దుబాయ్ పారిపోయాడని గుర్తించిన అధికారులు.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. గతంలో జూబ్లీహిల్స్ లోనూ ఇదే తీరులో కారు నడిపి అతడు ఇలాగే వ్యవహరించాడు. లుక్ అవుట్ నోటీసులపై రహీల్ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆ నోటీసుల్ని కొట్టివేయడంతోపాటు ఈనెల 19లోపు లొంగిపోవాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.