MLC కల్వకుంట్ల కవితను నిన్న అరెస్టు చేసి ఢిల్లీ తరలించిన ED అధికారులు.. ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. శుక్రవారం రాత్రి నుంచి ఇవాళ పొద్దున పదిన్నర గంటల వరకు ED కార్యాలయంలోనే ఆమెను ఉంచారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ లో రాత్రంతా ఉంచారు. ఇక ఆమెను కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మద్యం కేసులో మనీ లాండరింగ్ జరిగిందంటూ నిన్న ఆమె ఇంట్లో సోదాలు చేసిన అనంతరం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
వైద్య పరీక్షలు…
కవిత ఆరోగ్య పరిస్థితి(Health Condition) గురించి తెలుసుకునేందుకు ఈరోజు ఉదయం ఎనిమిదిన్నరకు మెడికల్ టెస్టులు చేశారు. వాటిని ఈడీ అధికారులకు డాక్టర్లు అందజేసిన అనంతరం కోర్టుకు వెళ్లే ప్రక్రియను మొదలుపెట్టారు. రౌస్ అవెన్యూ కోర్టు పరిధిలో ఉన్న CBI ప్రత్యేక న్యాయస్థానంలో ఆమెను హాజరుపరుస్తారు. అంతకుముందే కవితకు సంబంధించిన పూర్తి వివరాలు(Identity Proofs) తీసుకుని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం 14 రోజుల కస్టడీని అధికారులు కోరుతూ ఇందుకోసం స్పెషల్ పిటిషన్ వేయబోతున్నారు.