తాత్కాలికం(Temporaryly)గా తనను జైలులో పెట్టొచ్చని, కానీ తాను కడిగిన ముత్యంలా బయటకొస్తానని ED కస్టడీలో ఉన్న కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకెళ్తుండగా మాట్లాడారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసని అన్నారు. నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్న ఆమె.. ఇప్పటికే ఒక నిందితుడు BJPలో చేరితే ఇంకో నిందితుడికి కమలం పార్టీ ఏకంగా టికెటే ఇచ్చిందని విమర్శించారు. ఇక మూడో నిందితుడు మాత్రం ఆ పార్టీకి రూ.50 కోట్లు ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు.
కస్టడీ కంటిన్యూకి…
ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి కవితను తమ కస్టడీకి 15 రోజులు అప్పగించాలంటూ రౌస్ అవెన్యూ కోర్టులోని CBI ప్రత్యేక న్యాయస్థానాన్ని ED కోరింది. ఎట్టిపరిస్థితుల్లోనూ కస్టడీకి ఇవ్వొద్దని, ఆమెకు బెయిల్ మంజూరు(Bail Grant) చేయాలంటూ కవిత తరపు అడ్వొకేట్లు అభ్యర్థించారు. ఇలా ఇరు వర్గాల లాయర్లు తమ వాదనల్ని వినిపించారు. కవితకు 16 సంవత్సరాల వయసు గల తనయుడు ఉన్నాడని, అతడికి పరీక్షలు ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఈ వాదనల్ని విన్న న్యాయమూర్తి కావేరి భవేజా తీర్పుని రిజర్వ్ చేసి కాసేపట్లో వెలువరించనున్నారు.