ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే ED కస్టడీ ముగించుకున్న కల్వకుంట్ల కవితకు కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఆమెకు రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులోని CBI ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఆమెకు ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కవితకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించనున్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి కవితను తమ కస్టడీకి 15 రోజులు అప్పగించాలంటూ రౌస్ అవెన్యూ కోర్టులోని CBI ప్రత్యేక న్యాయస్థానాన్ని ED కోరింది. ఎట్టిపరిస్థితుల్లోనూ కస్టడీకి ఇవ్వొద్దని, ఆమెకు బెయిల్ మంజూరు(Bail Grant) చేయాలంటూ కవిత తరపు అడ్వొకేట్లు అభ్యర్థించారు. ఇలా ఇరు వర్గాల లాయర్లు తమ వాదనల్ని వినిపించారు. కవితకు 16 సంవత్సరాల వయసు గల తనయుడు ఉన్నాడని, అతడికి పరీక్షలు ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఈ వాదనల్ని విన్న న్యాయమూర్తి కావేరి భవేజా తీర్పుని ప్రకటించారు.
నిన్న సాయంత్రం దాకా..
కస్టడీలో భాగంగా నిన్న సాయంత్రం వరకు కవితను ED అధికారులు విచారించారు. దీంతో ఆమెను మరోసారి కస్టడీకి ఇవ్వాలని, లేదంటే రిమాండ్ విధించాలని కోర్డును ED కోరింది. ఆమె విచారణకు సహకరించలేదని, మిగిలిన నిందితుల్ని ప్రశ్నించే క్రమంలో కవితకు బెయిల్ ఇవ్వడం సరికాదు అంటూ ED తరఫు లాయర్లు కోర్టుకు తెలియజేశారు. ఇప్పటివరకు జరిగిన విచారణ తీరుపై PMLA సెక్షన్ 19 సబ్ సెక్షన్(2) ప్రకారం రికార్డయిన అన్ని వాంగ్మూలాలు, స్టేట్మెంట్లు అందజేయాలని EDని కోరినా తమకు ఇవ్వలేదంటూ కవిత లాయర్లు కోర్టు దృష్టికి తెచ్చారు.
బెయిల్ పిటిషన్ పై…
కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ మాత్రం ఏప్రిల్ 1న జరగనుంది. అయితే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ED(Enforcement Directorate) అధికారుల్ని కోర్టు ఆదేశించింది. అయితే ఇందుకు గడువు కావాలని ED కోరడంతో.. ఏప్రిల్ 1న మధ్యంతర బెయిల్ పై విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలియజేసింది.