
జమ్మూకశ్మీర్(Jammu Kashmir) లో ఘోర దుర్ఘటన చోటుచేసుకోవడంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బస్సు లోయలో పడటంతో(Bus Falls Into Gorge) 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 55 మంది ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. కిష్ట్వార్ నుంచి జమ్మూ వెళ్తుండగా దోడా జిల్లాలో అదుపు తప్పి 300 అడుగుల లోయలో పడటంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. బటోట్-కిష్ట్వార్ జాతీయ రహదారిపై తృంగల్-అస్సార్ సమీపంలో దుర్ఘటన జరిగింది. స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొని బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చారు. ప్రాణాలు కోల్పోయిన 36 మంది మృతదేహాలను మార్చురీకి తరలించారు. మిగతా 19 మంది గాయాలపాలు కాగా.. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ‘X’ హ్యాండిల్ ద్వారా తెలియజేశారు.

ప్రధాని సంతాపం.. ఎక్స్ గ్రేషియా ప్రకటన
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర సంతాపం తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ను ఆదేశించారు. మృతులకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున PMNRF కింద అందనున్నాయి. అవసరమైతే హెలికాప్టర్ సేవలు అందించాలని జిల్లా అధికారులకు కేంద్ర మంత్రి సూచించారు.