Published 29 Jan 2024
ప్రజాభవన్ ను కారుతో ఢీకొట్టి పరారైన కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిందితుల్ని కాపాడాలని ప్రయత్నించిన పోలీసు అధికారులపై వేటు పడుతూనే ఉంది. ఇప్పటికే ఒక CI(Circle Inspector) సస్పెండ్ కాగా… మరో సీఐని ఏకంగా అరెస్టు చేశారు. రాష్ట్రంలోనే సంచలనంగా మారిన కేసులో నిందితులు పారిపోయేందుకు సహకరించారని పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ MLA షకీల్ తోపాటు ఆయన కొడుకు సాహిల్ కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. మొన్నటి డిసెంబరు 23న అర్థరాత్రి సాహిల్ అలియాస్ రాహిల్ అతివేగం(Over Speed)తో కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ బారికేడ్లను ఢీకొట్టాడు.
ఈ కేసులో సాహిల్ ను తప్పించేందుకు డ్రైవర్ అబ్దుల్ అసిఫ్ ను అందులో ఇరికించాలని చూశారు. అదే అర్థరాత్రి నిందితుణ్ని గుట్టుగా అక్కణ్నుంచి పంపించివేశారు. ఇందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ కాగా.. అప్పటి CI దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. సీఐని సస్పెండ్ చేయడంతోపాటు ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కాల్ డేటా పరిశీలిస్తే బోధన్ CI బాగోతం వెలుగుచూసింది. బోధన్ నుంచి నిజామాబాద్ ట్రాన్స్ ఫర్ అయినా ఇంకా జాయిన్ కాని CI ప్రేమ్ కుమార్ ను.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఇద్దరు CIలపై వేటు పడటంతోపాటు ఇప్పుడు దుర్గారావుపై ఏకంగా కేసు నమోదు చేస్తున్నారు.
షకీల్ తనయుడి వ్యవహారంలో ఇద్దరు సర్కిల్ ఇన్స్ పెక్టర్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది. మొత్తంగా ఈ అంశంలో ఇప్పటివరకు ఎనిమిది మందిపై కేసులు నమోదు చేయడం చూస్తేనే ఉన్నతాధికారులు ఏ స్థాయిలో దృష్టిపెట్టారో అర్థమవుతుంది.