
అది 40 అడుగుల లోతున్న బోరు బావి. ఆడుకుంటూ అటుగా వెళ్లిన బాలుడు అందులో పడిపోయాడు. తల్లిదండ్రులు, చుట్టపక్కల వాళ్లు అటూఇటూ వెతికి బోరుబావిలో పడ్డాడని గుర్తించారు. అక అప్పట్నుంచి అందరిలో ఒకటే టెన్షన్. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనకు అంతు లేకుండా పోయింది. ఈ ఘటన బిహార్ లోని నలంద జిల్లా కుల్ గ్రామంలో జరిగింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు.. ఆ బాబును బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్ ను పంపించారు. లోపలికి ఆక్సిజన్ అందించేందుకు పైపులు వేశారు. సమాంతరంగా బావిని తవ్వి బాలుణ్ని ఎట్టకేలకు బయటకు తెచ్చారు. ఇందుకోసం రెస్క్యూ టీమ్ 5 గంటల పాటు తీవ్రంగా శ్రమించింది.
వెంటనే చిన్నారిని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. బాలుడు సురక్షితంగా బయటపడటంతో అక్కడున్న వారితోపాటు వార్తను విన్నవారిలో ఎక్కడలేని సంతోషం కనిపించింది.