
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ అనుభవిస్తున్న చంద్రబాబును CID కస్టడీకి అప్పగిస్తూ విజయవాడలోని ACB కోర్టు ఆదేశాలిచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబు తరఫు లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టులో వీగిపోయిన తర్వాత.. ACB కోర్టు న్యాయమూర్తి ఆర్డర్స్ ఇచ్చారు. మాజీ CMను రెండు రోజుల కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రేపు, ఎల్లుండి(ఈనెల 23, 24 తేదీల్లో) ఆయనపై విచారణ జరగనుంది. విచారణ ఎక్కడ చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. జైలులోనే చేపడతామని CID తరఫు లాయర్లు జవాబిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు రాకూడదని న్యాయమూర్తి ఆదేశించారు. చంద్రబాబునాయుడిని ఎవరెవరు విచారణ జరుపుతారో వారి పేర్లు వెల్లడించాలని న్యాయమూర్తి ఆదేశించారు. పొద్దున తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాల్సి ఉంటుంది. విచారణ ముగిసిన తర్వాత కోర్టు ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టాలని స్పష్టం చేశారు.
చంద్రబాబు 14 రోజుల రిమాండ్ ఈ రోజు ముగిసిపోవడంతో.. మరో రెండు రోజులు పొడిగిస్తూ న్యాయమూర్తి ఈ ఉదయం ఆదేశాలిచ్చారు. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదనలు కొనసాగిన దృష్ట్యా కస్టడీపై నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టారు. హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో.. ఆయన్ను CIDకి రెండు రోజులపాటు అప్పగిస్తూ ACB కోర్టు ఆదేశాలిచ్చింది.