కొద్దిరోజుల క్రితం ఆమె లిఫ్ట్ లో ఇరుక్కుని తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. తర్వాత ఈ నెల 13న రోడ్డు యాక్సిడెంట్(Road Accident) నుంచి అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు. కానీ మూడోసారి జరిగిన ప్రమాదం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ఇదీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ MLA లాస్య నందితకు ఎదురైన దుర్ఘటనలు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కారు పల్టీలు కొట్టి డివైడర్ ను ఢీకొట్టిన ఘటనలో ఆమె ప్రాణాలు విడిచారు.
కంటిన్యూ ఇన్సిడెంట్స్…
BRS పార్టీ ఈనెల 13న నల్గొండలో భారీ బహిరంగసభ నిర్వహించింది. ఆ సభ ముగిసి ఇంటికి తిరిగివెళ్తున్న సమయంలో నార్కట్ పల్లి వద్ద లాస్య నందిత కారును ఆటో ఢీకొట్టింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై(Highway)పై జరిగిన ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ ఈ రోజు జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఇలా 10 రోజులు కూడా గడవకముందే MLA లాస్య నందిత రెండు ప్రమాదాల బారిన పడటం ఆశ్చర్యకరంగా మారింది.
వేకువజామున…
తెల్లవారుజామున ORRపై ఐదున్నర గంటలకు సుల్తాన్ పూర్ గ్రామం వద్ద యాక్సిడెంట్ జరిగింది. ఏడాది వ్యవధిలోనే తండ్రి, కూతురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో లాస్య నందిత కారు డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో BRS పార్టీ తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత పోటీ చేసి గెలిచారు. ఆమె తండ్రి జి.సాయన్న MLAగా పనిచేయగా.. 2023 ఫిబ్రవరి 19న ఆయన మృతిచెందారు. దీంతో సాయన్న స్థానంలో ఆయన కూతురు నందితకు టికెట్ ను పార్టీ కట్టబెట్టి గెలిపించుకుంది.