
నేరగాళ్ల ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను తన ఇంట్లోనే దాచుకుని పట్టుబడిన SI రాజేందర్ ను పోలీసు కస్టడీకి తీసుకుంటున్నారు. ఇందుకు గాను ఆయన్ను రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ హైదరాబాద్ కూకట్ పల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. సైబరాబాద్ కమిషనరేట్ లో సైబర్ క్రైమ్ వింగ్ లో SIగా పనిచేస్తున్న రాజేందర్.. పెద్దయెత్తున మత్తుపదార్థాల్ని తన ఇంట్లో నిల్వ ఉంచుకున్నారు. ఈయనపై వలపన్నిన డిపార్ట్ మెంట్ అధికారులు.. కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో పట్టుకున్నారు. ఆయన ఇంటి నుంచి 1 కిలో 700 గ్రాముల డ్రగ్స్ ను నార్కోటిక్ బ్యూరో సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపగా.. సదరు సబ్ ఇన్స్ పెక్టర్ ను సైబరాబాద్ CP స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేశారు.
మహారాష్ట్ర నుంచి రికవరీ చేసిన ఈ డ్రగ్స్ కేసులో హస్తమున్నట్లు భావిస్తున్న ముగ్గురు నైజీరియన్స్, విశాఖకు చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. గతంలోనూ ACB చిక్కి సస్పెండైన రాజేందర్.. కోర్టు నుంచి స్టే తెచ్చుకుని డ్యూటీ చేస్తున్నారు. ఆయన దాచిన మత్తు పదార్థాల విలువ భారీగా ఉండటంతో.. దీని వెనుక గల కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దర్యాప్తు నిమిత్తం రాజేందర్ ను తమ కస్టడీకి అప్పగించాలని కోరడంతో.. కూకట్ పల్లి కోర్టు అందుకు పర్మిషన్ ఇచ్చింది.