హైదరాబాద్ లోని మాదాపూర్ అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ పట్టుబడిన కేసులో పలువురిని పోలీసులు పట్టుకున్నారు. ఇందులో సినీ నటుడు నవదీప్, మాజీ MP విఠల్ రావు తనయుడు దేవరకొండ సురేశ్ రావుతోపాటు ఐదుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ తెలిపారు. ఆగస్టు 31న మాదాపూర్ అపార్ట్ మెంట్ లో పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటనలో తప్పించుకు తిరుగుతున్న కీలక నిందితుల్ని 15 రోజులకు అరెస్టు చేశారు. వీరి నుంచి నార్కోటిక్ అధికారులు డ్రగ్స్ ను స్వాధీనం(Recovery) చేసుకున్నారు. ఈ కేసులో సినీ నటుడు నవదీప్ ను కస్టమర్ గా గుర్తించామని, ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని తెలిపారు. వీరితోపాటు వరంగల్ కు చెందిన వ్యక్తి సైతం ఇందులో ఉన్నట్లు గుర్తించామన్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ వచ్చాయన్న CP.. ఆర్గనైజేషన్స్ ను ఏర్పాటు చేసుకుని సోషల్ మీడియా ద్వారా వాటిని సప్లయ్ చేస్తున్నారని వివరించారు. బెంగళూరులో 18 మంది నైజీరియన్లు ఉన్నట్లు గుర్తించామని, దేశంలో వీసా ముగిసిన నైజీరియా వాసులు చాలా మంది తిష్ఠ వేసినట్లు తెలియజేశారు.
‘బేబీ’ సినిమా నిర్మాతలకు నోటీసులు
మాదక ద్రవ్యాల(Drugs)ను ఏ విధంగా వాడాలన్న దానిపై ‘బేబీ’ మూవీలో చూపించారని, ఇలాంటి సీన్లతో సినిమాలు తీయకూడదని ఆనంద్ స్పష్టం చేశారు. ‘బేబీ’ సినిమా నిర్మాతలకు నోటీసులు ఇస్తున్నామన్నారు. అయితే దీనిపై సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్ స్పందించారు. డ్రగ్స్ సన్నివేశాలకు సంబంధించిన అంశాలు ఉండటంతో కథలో వాడినట్లు వివరణ ఇచ్చారు. దీనిపై తనను పోలీసులు పిలిచి అడిగారని, ప్రజలకు ఆదర్శంగా ఉండేలా సినిమాలు తీయాలని కోరినట్లు డైరెక్టర్ అన్నారు. ఇక నుంచి ప్రతి సినిమాను అబ్జర్వ్ చేస్తూనే ఉంటామని CP స్పష్టం చేశారు.