బాణసంచా ఫ్యాక్టరీల్లో(Crackers Factories) పేలుడు(Explosion) జరిగి తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. తమిళనాడు విరుధునగర్ జిల్లాలో రెండు ఫ్యాక్టరీల్లో పేలుడు సంభవించింది. శివకాశి సమీపంలో ఒకటి, ఎం.పుదుపట్టి ఏరియాలో మరొక ఫ్యాక్టరీలో పేలుళ్లు జరిగాయి. శివకాశి సమీపంలోని రంగపాలెంలో జరిగిన ఇన్సిడెంట్ లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. రంగపాలెం ఫ్యాక్టరీలో ఏడుగురు, కమ్మపట్టి గ్రామ ఫ్యాక్టరీలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా అందులో పనిచేసే కూలీలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు చాలా సేపు కష్టపడ్డారు.
బాణసంచాను టెస్ట్ చేసే సమయంలో పేలుళ్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. గత కొన్నిరోజులుగా శివకాశి ప్రాంతంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాణసంచా ఫ్యాక్టరీల్లో టెస్టులు నిర్వహించడం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనల్లో మరికొందరికి గాయాలైనట్లు, కొందరికి మంటలు అంటుకున్నట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు.