Published 24 Jan 2024
అవి నోట్లా.. కట్టల పుట్టలా.. అని అనిపిస్తుంది అక్కడ పోసిన గుట్టల్ని చూస్తే. అది ఇల్లా లేక తన శాఖ(Department)కు సంబంధించిన ఖజానా(Treasury)నా. లెక్క పెట్టేందుకే గంటలకు గంటలు పట్టిందంటే ఆ ఆస్తులు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. సోదాలకు వెళ్లిన అధికారులే నోరెళ్లబెట్టారంటే ఆ సంపాదన ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇంతకంటే ఉపమానాలు ఉండవేమో.. HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తుల గురించి చెప్పడానికి. ఇప్పటిదాకా ఆయన స్థిర, చరాస్తుల విలువ రూ.100 కోట్లే అనుకున్నాం. కానీ ఆ రికార్డును క్రమక్రమంగా అధిగమించిందన్న వార్తలు చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
రోజంతా సోదాలే…
ఒక అధికారి ఇంట్లో ఏవో కొన్ని గంటలపాటు సోదాలు చేసి సీజ్ చేస్తారు ACB అధికారులు. కానీ ఈ శివబాలకృష్ణ ఆస్తుల్ని చూస్తే అది కొన్ని గంటల్లోనో, ఒక్క రోజులోనే తేలిపోయే వ్యవహారం కాదని అర్థమైంది. అందుకే ఈ రోజుతోపాటు రేపు కూడా పెద్దయెత్తున దాడులు కంటిన్యూ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తున్నది. HMDA టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా, రెరా కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు(Full Additional Charge) నిర్వర్తిస్తున్న బాలకృష్ణ నివాసాల్లో బుధవారం పొద్దున్నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో భారీయెత్తున మొబైల్ ఫోన్లు(iPhones), ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకుని పూర్తి వివరాలు రాబట్టే పనిలో పడ్డారు ACB అధికారులు.
తిమింగలం వద్ద రూ.500 కోట్ల వరకు…
శివబాలకృష్ణ ఆస్తులు అనుకున్నదాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నట్లు ACB టీమ్ లు గుర్తించాయి. ఆయన కుటుంబానికి మొత్తం నాలుగు బ్యాంకు లాకర్లున్నట్లు నిర్ధరించుకున్న అధికారులు.. రేపు వాటి పని పట్టాలని నిర్ణయించారు. ఇవాళ జరిపిన దాడుల్లో రూ.100 కోట్ల వరకు అక్రమ సంపాదన చూసి నివ్వెరపోయారు. 70 ఎకరాల భూములు, 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 9 ల్యాప్ టాప్ లు, 25 ఐఫోన్లు, 58 వాచ్ లు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ మణికొండలోని ఆదిత్య విల్లాస్ లో ఉంటున్న బాలకృష్ణ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. మొత్తం 17 టీమ్ లతో 18 గంటల పాటు అధికారులు కంటిన్యూగా సోదాలు చేస్తూనే ఉన్నారు. మణికొండతోపాటు మాసాబ్ ట్యాంక్ లోని రెరా కార్యాలయం సహా ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి.