ఇప్పటికే మణిపూర్ రాష్ట్రం రావణకాష్ఠంలా మారి ఎందరి ప్రాణాలో గాలిలో కలిసిపోగా.. ఇప్పుడు మరో రాష్ట్రంలోనూ అదే తరహా వాతావరణం కనపడుతోంది. రెండు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణలతో హరియాణాలో కర్ఫ్యూ(Curfew) విధించే వరకు వెళ్లింది. ఆందోళనకారులు వందల సంఖ్యలో వాహనాలు తగులబెట్టడంతోపాటు ధ్వంసం చేశారు. దీంతో నుహ్, ఫరీదాబాద్, పల్వాల్, రెవాఢి, గుర్ గ్రామ్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. నుహ్ జిల్లాలో మొదలైన అల్లర్లు మిగతా జిల్లాలకు పాకాయి. ఈ ఘటనలపై CM మనోహర్ లాల్ ఖట్టర్ రివ్యూ నిర్వహించారు. అయితే దీని వెనుక ‘మాస్టర్ మైండ్ ప్లాన్’ ఉందని హరియాణా హోం మంత్రి అనిల్ విజ్ అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇప్పటికే సదరు జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసుల్ని నిలిపివేశారు. నుహ్ జిల్లాలో ఒక వర్గం ర్యాలీ తీస్తుండగా మరో వర్గం రాళ్ల దాడికి పాల్పడింది. అలా స్టార్ట్ అయిన దాడులు ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు పోలీసుల పరిస్థితి సీరియస్ గా ఉంది. మూడు జిల్లాల్లో ఒక వర్గం టార్గెట్ గా ఇళ్లు, షాప్ లపై దాడులకు దిగారు. దీంతో గుర్ గ్రామ్ లోని సోనా టౌన్ నుంచి వందలాది కుటుంబాలు వలస వెళ్తున్నాయి. సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్(CAPF)కు చెందిన 20 కంపెనీలు హరియాణాకు చేరుకున్నాయి.