Published 02 Jan 2024
రాక రాక వచ్చిన అవకాశంతో పెండింగ్ చలాన్ల(Pending Challans)ను క్లియర్ చేసుకుంటున్న వాహనదారులకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఊహించని తాకిడికి గురైన వెబ్సైట్ ఇప్పటికే హ్యాంగ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు హ్యాంగ్ అవడమే పెద్ద సమస్యగా భావిస్తే ఇప్పుడు ఏకంగా సైబర్ కేటుగాళ్ల చెరలో చిక్కుకుంది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టిసారించారు. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం పెద్దసంఖ్యలో జనం సైట్ ను ఓపెన్ చేస్తున్నారు. కొందరు మీసేవ కేంద్రాలకు వెళ్తే… భారీ సంఖ్యలో ఓనర్లు మాత్రం సొంతంగా సైట్ ద్వారానే క్లియర్ చేసుకుందామనుకుంటున్నారు. ఈ లెక్కన ప్రభుత్వానికి పెద్దయెత్తున ఆదాయం వస్తున్న తరుణంలో.. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం ఏర్పాటు చేసిన సైట్ మాదిరిగానే మరో ఫేక్ వెబ్ సైట్ క్రియేట్ చేశారు నేరగాళ్లు. ఇప్పుడీ నకిలీ వెబ్ సైట్ పైనే సైబర్ క్రైమ్ దృష్టిసారించింది.
గుర్తించలేని విధంగా…
ఆ సైట్ పేరును సైతం అచ్చం ప్రభుత్వ సైట్ లాగే ఏర్పాటు చేసినట్లు భావిస్తున్న పోలీసులు.. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకునేవారు అసలు, నకిలీ సైట్లను జాగ్రత్తగా పరిశీలించాలని చెబుతున్నారు. అధికారిక వెబ్ సైట్ లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువమంది ఈ ఫేక్ సైట్ లో ఇరుక్కునే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. http://www.echallantspolice.in/ పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ అయిందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటిదాకా ఈ ఫేక్ వెబ్ సైట్ కు డబ్బులు చేరాయా.. అది ఏ స్థాయిలో ఉంటుందనే దానిపై సైబర్ క్రైమ్ విభాగం ఇన్వెస్టిగేషన్ చేస్తోంది.
గూగుల్ సెర్చ్ లో…
గూగుల్ లో సైట్ కోసం సెర్చ్ చేస్తున్న సమయంలో ఈ ఫేక్ సైట్ కనపడుతుంది. ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన తర్వాత పేమెంట్ అని దర్శనమిస్తుంది. అక్కడ పేమెంట్ కంప్లీట్ కాగానే ఎలాంటి మెసేజ్ రాకుండా తిరిగి వైట్ స్క్రీన్ కనిపిస్తుంది. అందుకే ఈ సైట్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దని ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా పోలీసులు ప్రచారం చేస్తున్నారు.
అధికారిక(అసలు) వెబ్ సైట్… http://echallan.tspolice.gov.in/
నకిలీ వైబ్ సైట్… http://echallantspolice.in/