అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయి ఎలాంటి వాడు.. ఏం చదువుకున్నాడు.. ఏం జాబ్ చేస్తున్నాడు.. సొంతిల్లు ఉందా.. ఎన్నెకరాల భూమి ఉంది.. ఆస్తిపాస్తులేమున్నాయి.. అని చూస్తారు. సొంత కులంలోనే సంబంధాలు వెతికినప్పుడు కనిపించే బాగోతాలివి. కానీ బాగా డబ్బులు పెట్టి చదివిపిస్తున్న తమ పిల్లలు ఏం చేస్తున్నారో మాత్రం చూసుకునే టైమ్ ఉండటం లేదు. డబ్బు.. డబ్బు.. డబ్బు.. ఇప్పుడిదే పెద్ద జబ్బుగా మారింది. డబ్బు సంపాదించడం తప్పు కాదు.. అది అందరికీ అవసరమే. కానీ డబ్బు మాయలో పడి అదే సర్వస్వం అనుకుంటే.. సర్వం కోల్పోక తప్పదు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఘటనలు చూస్తే ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. పిల్లలపై ప్రేమ ఉండాలి కానీ మరీ హద్దులు దాటేలా కాదు. డబ్బు సంపాదించు కానీ.. దాని ప్రభావం పిల్లలపై పడకుండా చూడాలి. పక్కచూపులు చూస్తున్నారో.. మందుకు బానిసయ్యారో.. అసలు పిల్లలు ఎవరితో తిరుగుతున్నారో పట్టించుకునే తీరిక లేకుంటే చివరకు కోల్పోయేది వాళ్లనే కాదు.. మొత్తం కుటుంబాన్నే.
ఒక్కడే కొడుకు, కూతురు.. ఏమన్నా అంటే ఏమవుతారో అన్న భయమే విచ్చలవిడితనాన్ని పెంచి పోషిస్తోంది. ఈ ‘ఒక్కడే’ అన్న ఆలోచనతోనే చాలా కుటుంబాలు పేరుకు రాకుండా పోయాయన్నది అందరికీ తెలిసిందే. అక్కను చంపి మరీ మతాంతర వివాహం కోసం 70 తులాల బంగారం, రూ.1.20 లక్షల్ని చిన్న కూతురు ఎత్తుకుపోయిందంటే ఎంతకు తెగబడ్డారో అర్థమవుతుంది. అంటే సుమారు రూ.50 లక్షల విలువైన సొమ్ము ఇంట్లో ఉందంటే ఆ కుటుంబంలో డబ్బుకు లెక్కలేదన్న మాట. బీటెక్ లో ఉన్నప్పటి నుంచే ఆమె ఎవరితో చనువుగా ఉంటుందనేది గుర్తించలేకపోయారు. సరే ఇవన్నీ అటుంచితే.. మధ్యతరగతి పట్టణాల్లో ఉండే ఆడపిల్లలు సైతం మందుకు అలవాటు పడటమేంటి. వోడ్కా, బ్రీజర్ తెప్పించి అక్కకు తాగించి తానూ తాగడం.. మత్తులోకి వెళ్లాక చోరీకి పాల్పడటం చూస్తే వాళ్ల తీరు ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతోంది. అటు ఎల్.బి.నగర్ లో యువతిపై దాడి చేసి ఆమె తమ్ముణ్ని హత్య చేసిన కేసులోనూ నిందితుడి చరిత్ర ఆశ్చర్యకరంగా ఉంది. మూడేళ్ల క్రితం సుత్తితో తలపై కొట్టి తండ్రిని హత్య చేసినా ఆ విషయం బయటకు రాకుండా దాచిపెట్టారు. ఉన్నోడు ఒక్కడే కొడుకు.. తండ్రిని చంపాడని తెలిస్తే ఆ ఒక్కడూ లేకుండా పోతాడు అన్న భయంతో చేసిన పనికి మరో దారుణం చూడాల్సి వచ్చింది. మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకోగా.. అమ్మాయిని ఎటూగాకుండా చేశాడు.
సొంత కులం కాదు కదా.. సొంత మతం కూడా కాదు మరి. చాలాకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నా పట్టించుకునే తీరిక లేకపోవడం.. మతాంతర వివాహానికి సిద్ధపడి ఎంతకైనా తెగించేందుకు రెడీ అవటం వాళ్లకిచ్చిన అతి స్వేచ్ఛ కాకుంటే మరేమిటి. ఒక ఆడపిల్ల చేసిన పనికి ఇద్దరు సంతానాన్ని కోల్పోవడమే కాదు.. ఆ కుటుంబమే ఛిన్నాభిన్నమైంది. గతంలోనూ ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. అందుకే తల్లిదండ్రులారా.. డబ్బు సంపాదించండి.. కానీ దాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి.. లక్షలకు లక్షలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా ఏం కాదు కానీ మనకు అంతుంది ఇంతుంది అని సంతానానికి తెలియకుండా మసలుకోండి. ఎంత ఆస్తి ఉన్నా అణకువుగా పెంచితేనే పిల్లలు గాడిన పడేది. లేదంటే ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా… జాగ్రత్తలు పాటించకపోతే ఫ్యూచర్ లో ఇలాంటి వాటికి లెక్కే ఉండదు మరి.
Explained very well..
Parents must think about it.